గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 10:44:21

బస్సులో మహిళ మృతి.. నడిరోడ్డు మీద దించేసిన కండక్టర్‌, డ్రైవర్‌

బస్సులో మహిళ మృతి.. నడిరోడ్డు మీద దించేసిన కండక్టర్‌, డ్రైవర్‌

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఈ మాయదారి కరోనా మనుషులను కఠిన మనస్కులుగా తయారుచేస్తోంది. ఓ మహిళ గొంతు నొప్పితో బాధపడుతూ ఆర్టీసీ బస్సులో మరణించిగా మహిళ మృతదేహాన్నిరోడ్డు మధ్యలోనే దింపి వేశారు. .

ధారూ‌ర్‌ మండలానికి చెందిన చిన ఆశప్ప 40 ఏండ్ల తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆశప్ప భార్యకు గొంతులో కణతి అయ్యింది.  ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో పాటు ఆహారం కూడా మింగడానికి ఇబ్బందులు పడుతుండగా హైదరాబాద్‌లో చికిత్స చేయించడానికి తాండూర్ నుంచి బస్సులో బయల్దేరారు.  మార్గమధ్యంలో ఆమెకు గొంతులో నొప్పి తీవ్రమైంది. నొప్పికి తాళలేక మహిళ బస్సులోనే మరణించింది. కరోనావైరస్ వల్లే మహిళ చనిపోయి ఉండవచ్చనే భయంతో తోటి ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌ మహిళ మృతదేహాన్ని బస్సులోంచి దించమని ఆశప్పను కోరారు. అయితే ఆమె కరోనాతో చనిపోలేదని ఆమెకు ఇంతకుముందే పరీక్షలు నిర్వహించారని నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆశప్ప తెలిపాడు.  అయినా వినకుండా ప్రయాణికులు బలవంతం చేసి నడిరోడ్డు మీదే మృతదేహాన్ని దింపేశారు. దిక్కుతోచని స్థితిలో కూతుళ్లు తల్లి మృతదేహం వద్ద రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 

ఆ తరువాత ఆ వ్యక్తి తన అల్లుడు, కిష్టాపూర్‌ సర్పంచ్‌కు సమాచారం అందించగా.. చివరకు ఒక ఆటో డ్రైవర్ మృతదేహాన్ని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఆ తరువాత మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలిందని వైద్యులు ధృవీకరించారు. 

నెల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక వ్యక్తి ఆస్తమాతో బాధపడుతుండగా అతడిని దవాఖానకు తీసుకెళ్లేందుకు ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో అతను రోడ్డు పక్కనే మృతి చెందాడు. కనీసం అంబులెన్స్‌ సిబ్బంది సైతం వ్యక్తి వద్దకు రాలేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo