మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:32

ఎంతపని చేశావు తల్లీ!

ఎంతపని చేశావు తల్లీ!

ఇద్దరు కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య

జవహర్‌నగర్‌లో విషాదం

జవహర్‌నగర్‌: కుటుంబ కలహాలు, పంతాలు పట్టింపులు.. క్షణికావేశంతో ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చెరువులో పడేసి ఆ తర్వాత తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆనంద్‌నగర్‌లో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన నాగమణి(25)కి జవహర్‌నగర్‌ పరిధిలోని ఆనంద్‌నగర్‌కు చెందిన వలపర్ల నాగేశ్వరరావుతో 2014లో వివాహమైంది. వీరికి రూబి(5), పండు(8 నెలలు) కూతుళ్లున్నారు. నాగేశ్వరరావు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోఉద్యోగం చేస్తుండగా.. నాగమణి ఇంటి వద్దే ఉంటున్నది. ఉమ్మడి కుటుంబంగా ఉన్న వీళ్లు చిన్నపాటి గొడవల కారణంగా గతేడాది విడిపోయి వేరుకాపురం పెట్టారు. క్రిస్మస్‌ పండుగకు సొంతూరు వెళ్లేందుకు భర్త ఒప్పుకోకపోవడంతో నాగమణి గొడవపడినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో 24వ తేదీ నుంచి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 26వ తేదీన నాగేశ్వరరావు భార్యాపిల్లలను తీసుకెళ్లి తన తల్లి, సోదరులు ఉంటున్న ఇంట్లో దిగబెట్టి బయటికి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత నాగమణి, పిల్లలు ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిసరప్రాంతాల్లో వెతికారు. సికింద్రాబాద్‌తోపాటు జేబీఎస్‌లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అదే రోజు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం చెన్నాపురం సమీపంలోని చెరువులో మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మోహన్‌.. నాగేశ్వర్‌రావును పిలిపించగా చెరువు గట్టుపై ఉన్న చెప్పుల ఆధారంగా మృతిచెందిన వారు నాగమణి, రూబి, పండుగా గుర్తించారు.