ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

వికారాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. బొంరాస్పేట మండలం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బొంరాస్పేట గ్రామానికి చెందిన బ్యాగరి పద్మమ్మ (45) భర్త వదిలేయడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఉదయం రోజువారీగా పరిగి పట్టణంలో కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం బస్సులో ఇంటికి బయల్దేరింది.
బొంరాస్పేట స్టేజీ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని యాద్గిర్కు వెళ్తున్న ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు (నెం కేఏ 32ఎఫ్ 2360) ఢీకొట్టడంతో బస్సు ముందు టైరు కిందపడి ఘటనా స్థలంలోనే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.