శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 08:34:15

చిన్నారితోపాటు గొయ్యిలో పడిన మహిళ... వీడియో

చిన్నారితోపాటు గొయ్యిలో పడిన మహిళ... వీడియో

హైదరాబాద్   : పీర్జాదిగూడ నగరపాలక పరిధి బుద్దానగర్‌కాలనీ 40 ఫీట్‌ రోడ్డులో తాగునీటి పైపులైన్‌ కోసం తీసిన గొయ్యిలో చిన్నారితోపాటు ఓ మహిళ పడిన ఘటన రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్‌ ఓల్డ్‌విలేజీకి చెందిన లహరిక, భాను దంపతులకు ఈనెల 7వ తేదీన పీర్జాదిగూడలోని ఓ ప్రైవేటు దవాఖానలో బాబు పుట్టాడు. ఈ క్రమంలో తిరిగి గురువారం రాత్రి దవాఖానకు బాబుతోపాటు బాబు తల్లి, అమ్మమ్మ చంద్రకళ కలిసి వైద్యం కోసం వెళ్లారు. ఈక్రమంలో ఆకస్మికంగా కురిసిన వర్షానికి దవాఖాన ముందు రెండురోజుల క్రితం నీటి పైపులైన్‌ పనుల కోసం తవ్విన గొయ్యిలో వర్షంనీరు నిలిచిపోవడంతో గమనించని చంద్రకళ బాబుతో ప్రమాదవశాత్తు నీటి గొయ్యిలో పడింది.

 స్థానికులు వెంటనే గొయ్యిలో పడిన ఇద్దరిని బయటకు తీశారు. దీంతో బాబుకు, చంద్రకళకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్లు అమర్‌సింగ్‌, యుగేంధర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని మట్టితో పూడ్చి వేయించారు. ఈ ఘటనపై మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా, రెండు రోజుల క్రితం నీటి పైపులైన్‌ జంక్షన్‌ కోసం గొయ్యి తవ్వారని, ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా పైపులైన్‌ పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మేయర్‌ తెలిపారు. 

కలెక్టర్‌ ఆదేశాలతో గుంత పూడ్చిన మున్సిపల్‌ సిబ్బంది

సోషల్‌ మీడియాలో గురువారం ఫిర్జాదీగూడలో ఒక గుంతలో చంటి బిడ్డతో ఒక మహిళ పడిన వీడియో వైరల్‌ అయింది. వీడియోలో అత్యంత ప్రమాదకరంగా పడిన మహిళ, శిశువును అక్కడ ఉన్న వారు వెంటనే రక్షించడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో అత్యంత ప్రమాదకరంగా ఉన్న గుంతను వెంటనే పూడ్చాల్సిందిగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో నీటి గుంతలోని నీటిని తీసివేసి గుంతను పూడ్చివేశారు.


logo