గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:47:02

ఇందూరు అడవుల్లో ఇండియన్‌ తోడేలు

ఇందూరు అడవుల్లో ఇండియన్‌ తోడేలు

  • గోదావరి నదీ తీరాన కనువిందు 
  • అంతరిస్తున్న తోడేలు జాతుల్లో ఇదీ ఒకటి
  • తెలంగాణలో కనిపించడం ఇదే మొదటిసారి
  • కాళేశ్వర జలంతో పరుచుకున్న పచ్చదనం
  • మళ్లీ కనిపిస్తున్న అరుదైన జీవజాతులు

ఇండియన్‌ గ్రే వోల్ఫ్‌.. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఈ దేశీ తోడేలు నిజామాబాద్‌ అడవుల్లో కనువిందు చేసింది. జిల్లాకు చెందిన నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌ చైర్మన్‌, వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌ క్యాతం సంతోష్‌కుమార్‌ నందిపేట మండలం గోదావరి తీరంలో దీన్ని గుర్తించారు. వెంటనే తన కెమెరాలో బంధించి, ‘నమస్తే తెలంగాణ’ వీక్షకులకు అందించారు. మొత్తం 4 తోడేళ్లను చూసినట్టు చెప్పారు.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నీళ్ల గలగలలు.. పక్షుల కిలకిలలు.. వన్యప్రాణుల పరుగులతో తెలంగాణ అడవి తల్లి అబ్బురపడుతున్నది. కనుమరుగైన జంతుజాలం కండ్లముందు కనువిందు చేస్తుంటే ఖుషీ అవుతున్నది. ప్రకృతిని పరుచుకొని పరవశించిపోతున్నది. తెలంగాణలో జలవిప్లవం జీవన ప్రమాణాలనే కాకుండా జీవవైవిధ్యంలో కూడా మార్పులు తెస్తున్నది. ప్రాజెక్టులు నిండు కుండల్లా కళకళలాడుతుండటంతో వాటి చుట్టూ నేలంతా పచ్చగా మారిపోయింది. ఈ అపురూప దృశ్యాలు వన్యప్రాణులను సైతం ఆకర్షిస్తున్నాయి. 

తాజాగా, ఇండియన్‌ వోల్ఫ్‌(దేశీ తోడేలు) నందిపేట మండలం గోదావరి తీరంలో కనిపించింది. దీని శాస్త్రీయనామం క్యానిస్‌ లూపస్‌ పల్లిప్స్‌. దేశవ్యాప్తంగా ఈ జాతి తోడేళ్లు 2వేల నుంచి 3 వేల వరకు ఉంటాయి. వీటిని తెలంగాణలో తొలిసారి గుర్తించినట్టు వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌ క్యాతం సంతోష్‌కుమార్‌ తెలిపారు.అక్కడి పచ్చికబయళ్లు వన్యప్రాణులను ఆకర్షించాయని, అందువల్లే అంతరించిపోతున్న జీవాలు తెలంగాణకు లైన్‌ కడుతున్నాయని ఆయన వెల్లడించారు.   వీటిని తొలిసారి 1831లో బ్రిటిష్‌ ఓర్నితాలజిస్ట్‌ విలియం హెన్రీ సైక్స్‌ గుర్తించారు. కాగా.. తెలంగాణలోని గోదావరి తీరప్రాంతం జల కాంతులతో, జంతుజాలపు శోభతో అలరారుతున్నది. గోదావరి అందాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలే అన్నట్టుగా భావించేవారు. ఇప్పుడు తెలంగాణలోని గోదావరి తీరప్రాంతంలో అసలుసిసలైన అందాలు వెలుగుచూస్తున్నాయి. 

ఎండాకాలం వచ్చిందంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని గోదావరి తీరవాసులకు ఇసుక మేటలు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కాళేశ్వర జలప్రభతో మండువేసవిలోనూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకు నీళ్లు నిలకడగా ఉన్నాయి. ఎగువన గోదావరి నదిలో, దిగువన వరద కాలువలో పుష్కలంగా నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. ఫలితంగా అరుదైన పక్షులు, గతంలో ఇక్కడ కనిపించకుండాపోయిన జంతువులు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం పరిధిలోకి వచ్చే ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో జీవవైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మండే వేసవిలో నీళ్లులేక అల్లాడే పశు పక్ష్యాదులు, వన్యప్రాణులన్నింటికీ ఇప్పుడు బ్యాక్‌వాటర్‌ అద్భుతమైన విడిది కేంద్రంగా మారింది. గోదావరి బ్యాక్‌వాటర్‌లో జింకలు, కృష్ణ జింకలు, నీల్గాయిలు, అడవిపందులు, ఫ్లెమింగో పక్షులు, రంగురంగుల చిలుకలు, ఎర్రకాళ్ల కొంగలు దర్శనమిస్తున్నాయి.


గోదావరి తీర అందాలు అద్భుతం

పదేండ్ల నుంచి నేను నిజామాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాలను దగ్గర్నుంచి పరిశీలిస్తున్నాను. రెండేండ్లుగా ఫొటోలు తీస్తున్నాను. చార్‌సింగా వంటి జింకలు అడవిమామిడిపల్లి అడవిలో చూశాను. చిరుతలు, ఎలుగుబంట్లు, నీల్గాయి వంటివి వేల సంఖ్యలో ఉన్నాయి. పెయింటెడ్‌ శాంట్రూస్‌ పక్షి తెలంగాణలో ఎక్కడాలేదు. నిజామాబాద్‌లో కనిపిస్తే నేనే ఫొటో తీశాను. ఈ పక్షి కోసం దేశం నలుమూలల నుంచి చాలా మంది పర్యావరణ ప్రేమికులు జిల్లాకు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. అరుదైన పక్షులు అనేకం గోదావరి తీర ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఎల్లో ఫుటెడ్‌ పిజిన్‌ అనే పావురం, ప్లమ్‌ హెడ్‌ ప్యారట్‌, ఫ్లెమింగో పక్షులు అనేకం ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి.

- క్యాతం సంతోష్‌కుమార్‌, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్

అరుదైన జీవజాతులెన్నో..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అద్భుతమైన అటవీ సంపదకు నెలవు. లక్షా 66వేల 441 హెక్టార్లలో విస్తరించిన అడవుల్లో 50కి పైగా చిరుత పులులు ఉన్నట్లు గుర్తించారు. ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, మనుబోతులు, అడవి కుక్కలు వందలాదిగా ఉన్నాయని అటవీశాఖ వెల్లడించింది. గత కొన్నేండ్లుగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో వన్యప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రత్యేకించి ఎలుగుబంట్లు, చిరుతలు, అడవి పందులు, జింకలు, నక్కలు, నెమళ్లు భారీగా వృద్ధి చెందాయి. 50కి పైగా చిరుతలు, 870 సాంబార్లు, 3,100 కొండ గొర్రెలు, 1,500 దుప్పులు, 6,200 కుందేళ్లు, 600 వరకు నీల్గాయి, 300కు పైగా ఎలుగుబంట్లు, 4,500 వరకు జింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీగా పెరిగిన జంతుజాలానికి ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ నెలవుగా మారింది. ప్రాజెక్టులో నిరంతరాయంగా నీరు ఉండడంతో చాలావరకు జీవులు అక్కడి పరిసరాల్లోనే తలదాచుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో కృష్ణ జింకలను చూడలేదని, కానిప్పుడు ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ విస్తరించిన నందిపేట మండలంలో అవి కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.


logo