ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:30

పల్లెల్లో పనుల పండుగ

పల్లెల్లో పనుల పండుగ

  • 3.5 లక్షలకు పెరిగిన కూలీలు .. కరోనా వేళలోనూ చేతినిండా పని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర నుంచే ఉపాధి పనులకే వెళుతున్నాం.. ఇప్పుడు మొక్కలు నాటే పనికి రమ్మన్నారు.. తర్వాత కల్లం కట్టే పనులకు పిలుస్తామన్నారు.. ఇదీ వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన రాజ్యలక్ష్మి మాట! కరోనా రోగంతో ఎవరూ పనికి పిలవట్లేదు. కానీ.. ఉపాధి హామీ పని మాత్రం రోజూ దొరుకుతున్నది.. ఇదీ జనగామ జిల్లాకు చెందిన పెంటయ్య అనే కూలీ సంతోషం! వీరిద్దరేకాదు.. కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన అనేకమంది కూలీలకు ఇప్పుడు ఊళ్లలోనే చేతినిండా పనిదొరుకుతున్నది. పనులు 

పండుగలా సాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెలంగాణ సర్కారు కొత్త పథకాలతో, సక్రమంగా వినియోగిస్తుండటంతో కూలీలకు ఏడాది పొడుగునా పనులు లభిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రోజూ మూడున్నర లక్షల మంది ఉపాధిహామీ పనులకు వెళ్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటుండటం విశేషం. 

ఊతమిస్తున్న పథకాలివే..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు, కల్లాల నిర్మాణం సహా గ్రామానికో ప్రకృతివనం ఏర్పాటు కూడా నరేగా జాబితాలో చేర్చింది. ఇవే కాకుండా పల్లెప్రగతిలో భాగంగా నిర్మించతలపెట్టిన డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు హరితహారంలో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకమూ నడుస్తున్నది. వరద నీటగిని ఒడిసిపట్టేందుకు కందకాల తవ్వకం, ఫాంపాండ్స్‌ నిర్మాణమూ కొనసాగుతున్నది. వీటన్నింటికీ ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తున్నారు.

గతేడాది 2 లక్షలు.. ఇప్పుడు 3.5 లక్షల మందికి పనులు

గతేడాది ఇదే సమయానికి 2లక్షల మంది కూలీలు పనుల్లో ఉండగా, ప్రస్తుతం 3.5 లక్షల మంది పనులకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ దెబ్బకు మొన్నటి వరకు పట్టణాల్లో చిన్నా, చితక పనులు చేసుకున్న వారంతా ఇప్పుడు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో పనిదినాల కల్పనలోనూ రాష్ట్రం ముందువరుసలో ఉన్నది. ఈ ఏడాది మొత్తంగా 13.66 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా మూడున్నర నెలల్లోనే 10.93 కోట్ల పనిదినాలను పూర్తి చేసుకున్నది. 1,51,271 మంది కొత్త కూలీలను గుర్తించి జాబ్‌కార్డులు ఇవ్వటం విశేషం.  

సీఎం కేసీఆర్‌ శ్రద్ధతోనే.. 

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమైనంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించడం సాధ్యమవుతున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఉపాధిహామీలో చేపట్టేందుకు చాలా అనువైనవి. నరేగా నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నది. 

-  కృష్ణమూర్తి, ఎస్‌పీఎం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌

గతేడాది 15 రోజులే.. 

పోయిన ఏడాది మొత్తంలో 15 రోజులు మాత్రమే కరువు పని దొరికింది. ఈ సారి లాక్‌డౌన్‌ వచ్చినప్పటి నుంచి రోజూ కరువు పనికే వెళ్తున్నాం. మా ఇంట్లో ముగ్గురం నెలన్నరగా ఇదే పనులు చేస్తున్నాం. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నారు. 

-రాజ్యలక్ష్మి, వరంగల్‌ రూరల్‌ జిల్లా

ఉపాధి పనితోటే పూట గడుస్తున్నది 

కరోనా రోగం వచ్చినసంది ఎవరూ పనికి పిలువలేదు. కరవు పనికి పోతేనే మాకు పూటగడుస్తున్నది. ఇప్పుడు చాలా మంది పనికి పిలుస్తున్నా పోతలేను. ఉపాధి పనికి ఎన్ని రోజులైనా పోవాలనిపిస్తుంది.

-పెంటయ్య, జనగామ జిల్లా

నరేగా కింద నడుస్తున్న పనులు

పనిపేరుమంజూరు
పురోగతిలో
పూర్తయినవి
డంపింగ్‌ యార్డులు
9,968
2,174
2,867
సెగ్రిగేషన్‌షెడ్లు
12,301
11,009
163
కల్లాలు
1,00,000
232--logo