శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 18:25:45

సరైన ప్రోత్సాహం అందిస్తే.. మహిళలు గొప్ప పారిశ్రామికవేత్తలవుతారు

సరైన ప్రోత్సాహం అందిస్తే.. మహిళలు గొప్ప పారిశ్రామికవేత్తలవుతారు

హైదరాబాద్ : మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలుగా రాణించలేకపోతున్నారు. వీరికి సరైన చేయూత అందిస్తే ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారని గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. వి.హబ్ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంత్రి  తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వి.హబ్ నిర్వాహకులను అభినందించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించడానికి వి.హబ్ చేస్తున్నకృషి ప్రశంసనీయమన్నారు.


రాష్ట్రంలో మహిళలు కష్టపడి పనిచేసేవారని, అత్యంత నిజాయితీపరులని అన్నారు. తెలంగాణ మహిళలకు అవకాశం వస్తే కచ్చితంగా తమ సత్తాను నిరూపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి కేటిఆర్ నేతృత్వంలో తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించి, పారిశ్రామికవేత్తలను రూపొందించేందుకు తీసుకొచ్చిన టిఎస్ఐపాస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఆయన తీసుకొచ్చిన వి.హబ్ నేడు అందరి ప్రశంసలు పొందుతోందన్నారు. 

జనాభాలో సగం ఉన్న మహిళలు అవకాశాల్లోనూ అంతకంటే ఎక్కువగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ అత్యంత ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారని, వీరిని గుర్తించి సరైన విధంగా ప్రోత్సహిస్తే రాష్ట్రం గర్వించే విధంగా ఎదుగుతారని తెలిపారు. కొవిడ్ సమయంలోనూ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు వి.హబ్ సీఈవో దీప్తి రావు, ఆమె టీమ్ ఇస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శనం అభినందనీయమైందన్నారు. 




logo