శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 01:05:29

వారసుల్లో గెలుపోటములు

వారసుల్లో గెలుపోటములు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలపడ్డ వారసుల్లో కొంతమంది విజయం సాధించగా, మరికొందరూ పరాజితులయ్యారు. ఓటరుదేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో కొంతమంది సఫలంకాగా, ఇంకొందరు విఫలమయ్యారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అగ్రనేతల వారసులుగా బరిలో దిగగా, కొందరు మాత్రమే విజయతీరాలకు చేరుకొన్నారు.

* దివంగత బీజేపీ నేత ఆలె నరేంద్ర కోడలు ఆలె భాగ్యలక్ష్మి గౌలిపుర డివిజన్‌ నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఇక్కడ ఇది వరకు నరేంద్ర భార్య లలిత కార్పొరేటర్‌గా గెలుపొందగా, తాజాగా వారి కోడలు విజయం సాధించారు.

* ఆలె నరేంద్ర మేనల్లుడు ఏ వినయ్‌కుమార్‌ భార్య పావని గాంధీనగర్‌ నుంచి బరిలో దిగి, ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన  ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తమ్ముడి భార్య ముఠా పద్మను ఓడించారు.

* బంజారాహిల్స్‌ నుంచి ఇద్దరు వారుసులు తలపడ్డారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత కే కేశవరావు కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మి, గోల్కొండ సింహంగా పేరుగాంచిన దివంగత బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు తలపడగా విజయలక్ష్మి గెలిచారు.

* గడ్డిఅన్నారం నుంచి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బద్దం సుభాష్‌రెడ్డి కుమారుడు బద్దం ప్రేమ్‌మహేశ్‌రెడ్డి విజ యం సాధించారు.

* ఖైరతాబాద్‌ సైతం వారసుల పోరుకు వేదికయ్యింది. ప్రజానేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా బరిలో దిగి, ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు సింగారి సుదర్శన్‌ కుమార్తె వీణామాధురిపై ఘనవిజయం సాధించారు.

* మేయర్‌ బొంతు రామ్మెహన్‌ భార్య శ్రీదేవి చర్లపల్లి నుంచి ఘనవిజయం సాధించారు.

* భారతీనగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కోడ లు సింధు ఆదర్శ్‌రెడ్డి సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా పోటీచేసి, తన పాత ప్రత్యర్థి బీజేపీ నేత అంజిరెడ్డి భార్య గోదావరిపై రెండోసారి విజయం సాధించారు.

* దివంగత మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల  విజయశాంతిరెడ్డి అల్వాల్‌ డివిజన్‌ నుంచి గత ఎన్నికల్లో గెలిచి, మరోసారి  అదే స్థానంనుంచి గెలుపొందారు.

* మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ నుంచి రెండోసారి తలపడగా, బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.

* కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కవాడిగూడ నుంచి మరోమారు తలపడగా, గెలుపుతీరాలను చేరుకోలేకపోయారు.

* ఏఎస్‌రావునగర్‌లో సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి కుమార్తె పజ్జూరి పావనీరెడ్డి రెండోసారి తలపడిగా, కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

* టీఆర్‌ఎస్‌ మరో కీలక నేత నందకిషోర్‌వ్యాస్‌ (బిలాల్‌) కుమార్తె పూజావ్యాస్‌ బిలాల్‌ బేగంబజార్‌ డివిజన్‌ నుంచి తొలిసారిగా ఎన్నికల్లో తలపడినా విజయం సాధించలేకపోయారు. 

* ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్నారెడ్డి సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా హబ్సిగూడ నుంచి బరిలో దిగినా బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజితులయ్యారు.

* టీఆర్‌ఎస్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఇంచార్జి రామ్మెహన్‌గౌడ్‌ భార్య లక్ష్మీప్రసన్న బీఎన్‌ రెడ్డినగర్‌ నుంచి సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా బరిలో దిగి ఓటమి పాలయ్యారు.


logo