శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 16:28:02

టీఆర్ఎస్ ను లక్ష మెజార్టీతో గెలిపించండి : మంత్రి హరీశ్ రావు

టీఆర్ఎస్ ను లక్ష మెజార్టీతో గెలిపించండి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. దుబ్బాక నియోజకవర్గంలో అతి త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ విద్యార్థి, యువత అనుబంధ సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దుబ్బాక నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలను కలువాలన్నారు. 

మనం చేసిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్జీతో టీఆర్ఎస్ ని గెలిపించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు. బీజేపీకి కార్యకర్తలు లేరు. దుబ్బాకలో ఎవరు గెలుస్తారని యువకుల నుంచి పండు ముసలిని అడిగినా.. టీఆర్ఎస్ దే విజయం అంటారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు వస్తాయా అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఉప ఎన్నికలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు దుబ్బాక ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో తొలగిపోయాయనే సంతోషంలో ఉన్నట్లు మంత్రి వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ సాగునీరు దుబ్బాక నియోజకవర్గానికే వస్తుందన్నారు. లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వుకుంటే రెండు పంటలు వేసుకోవచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బోరు బావులకు విద్యుత్ మీటర్ల బిగింపునకు పూనుకుంటున్నందున దానిని వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ కు ఓటు వేసి బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన వారందరికి పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే అని హరీశ్ రావు హామీ ఇచ్చారు.


దేశంలోని 18 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 56 వేల 906 పింఛన్లు ఉన్నాయని, ఇటీవల 5,877 కొత్త పింఛన్లు మంజూరైనట్లు వివరాలను వెల్లడించారు. దుబ్బాకలో చదివిన కేసీఆర్ సారుకు.. బీడీ కార్మికుల బాధలు తెలుసునని, దుబ్బాకపై ప్రేమ, మమకారంతో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించారన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవాలని పార్టీ కార్యకర్తలు, సంఘాల బాధ్యులు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మార్గదర్శనం చేశారు.

ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కు లక్ష మెజార్టీ ఇవ్వాలన్నారు. కేసీఆర్ కు దండం పెట్టి దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని హరీశ్ రావు స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్ రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ జలాశయ కాలువ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తుంటే.. కోర్టు కేసులు పెట్టి అభివృద్ధికి నిరోధకులుగా మారుతూ.. కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

మాటలు చెప్పడం తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఏమీ కాదని ఎంపీ తెలిపారు.  ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ నేతలు వానకాలం కప్పల మాదిరిగా ఎన్నికలు రాగానే వచ్చిపోతారన్నారు. కార్యక్రమంలో పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మిరుదొడ్డి మండల పార్టీ ఇంచార్జి సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.