e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides దళిత బంధుకు దన్నుగా నిలుద్దాం

దళిత బంధుకు దన్నుగా నిలుద్దాం

భారతీయుల సంక్షేమం లక్ష్యంగా అన్ని రంగాల్లో సమన్యాయం అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, భారత దేశంలో నివసిస్తున్న ప్రజల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని 38వ ఆర్టికల్‌ ముఖ్య ఉద్దేశ్యం. దీనికి కొనసాగింపుగానే ఆర్టికల్‌ 46 ప్రకారం అణగారిన, వెనుకబడిన ప్రజలందరికీ ప్రత్యేకించి షెడ్యూల్‌ కులాలు, తెగల ప్రజలకు విద్య, ఆర్థిక రంగాల్లో ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలబడాలని రాజ్యాంగంలో పొందుపరిచారు.

70 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీల ప్రగతి గురించి ఆలోచించి, ఆచరించిన పార్టీలు చాలా తక్కువ. ఒకవేళ ఆలోచించినా అది ఏదో ఒక కాలానికి, ఒక నాయకత్వానికే పరిమితం అయ్యింది. అయితే తెలంగాణలో సాగిన ప్రయాణం వేరు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దళిత బంధు’ పథకం ఆ ప్రయత్నంలో ఒక అతి కీలకమైన నిర్ణయం. దీని అమలు మీద చాలా సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. కొందరైతే దీనిని చాలా వ్యతిరేక భావంతోనే చూస్తూ, విమర్శిస్తున్నారు. ఎవరికైనా తమ తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంటుంది. కాదనడం ప్రజాస్వామ్య వ్యతిరేకం. కానీ ఒక దానిని తిరస్కరిస్తున్నామంటే, దానికి ప్రత్యామ్నాయం చూపించా ల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది.

- Advertisement -

ఈ రోజు ‘దళిత బంధు’ పథకం రావడానికి ఉన్న నేపథ్యాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మిగతా నాయకుల ఆలోచనలకు తేడా ఉంది. దళితుల సమస్యలు, వారి బాధల పట్ల కేసీఆర్‌ చాలా రోజులుగా ఒకేరకమైన ఆలోచనలతో ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 1985 తొలినాళ్ల నుంచి నేటి వరకు ఆయన ఈ విషయమై ఆలోచిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఏర్పడిన రెండేండ్లకే తెలంగాణలో ‘దళిత ఎజెండా’ పేరుతో ఒక రోడ్‌ మ్యాప్‌ను ఆమోదించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పైన జరిగిన ఉద్యమంలో కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రభాగాన నిలిచింది. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం జరిపిన మొదటి సమావేశం దళితుల సమస్యలపైననే.


అదేవిధంగా బడ్జెట్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్లాన్‌, సబ్‌ప్లాన్‌ స్థానంలో మార్పులు చేయడానికి అంగీకరించిన మొదటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాత్రమే. దానికి అనుగుణంగానే సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ‘ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ యాక్ట్‌’గా మార్పు చేసి గతంలో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దిన ఘనత కూడా కేసీఆర్‌ ప్రభుత్వానిదే. తెలంగాణ రూపొందించిన చట్టం నమూనానే ఈ రోజు దేశవ్యాప్తంగా అనుసరించబోతున్నారన్నది ఒక సత్యం.

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల రెసిడెన్షియల్‌ పాఠశాలల సంఖ్యను రెట్టింపు చేశారు. బీసీలకు, మైనార్టీలకు కూడా అటువంటి అవకాశం కల్పించారు. దేశంలో మరొక రాష్ట్రంలో ఇటువంటివి జరుగలేదు. ఎస్సీలకు ఆర్థిక సహకారం అందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది యూనిట్లను అందజేశారు. వీటి ద్వారా కొద్దిమంది ప్రయోజనం పొంది ఉండవచ్చు. కానీ ఎక్కువ సంఖ్యలో నిరుపయోగమయ్యాయి. కారణం ఏమిటంటే, చాలా తక్కువ సాయం అందించడం, పర్యవేక్షణాలోపం, ఏదో కంటితుడుపుగా నిధులు ఇచ్చి, చేతులు దులుపుకునే పరిస్థితి గతంలో ఉండేది. అయితే, ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకొస్తున్నది. ఏదైనా వ్యాపారమో, వాణిజ్యమో, ఏదైనా ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు చేపట్టాలంటే ప్రస్తుత ఆర్థిక సహాయ పథకాలు సరిపోవని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఆ పథకంలో ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే మొత్తాన్ని పది లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా దీనిని ఒక నిర్దిష్ట ప్రాంతంలో అమలు చేయాలనేది రెండవది. ఇది కూడా చాలా సమంజసమైన నిర్ణయం. ఎందుకంటే, ఏదైనా ఒక నూతన పథకాన్ని అమలు చేయాలంటే, ప్రయోగాత్మకంగా చిన్న ప్రాంతంలో అమలు చేసి చూడాలి.

కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ హయాంలోగానీ, బీజేపీ హయాంలోగానీ పైలట్‌ ప్రాజెక్టులుగానే గతంలో అనేక పథకాలను అమలు చేశాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అదేవిధంగా గతంలో లాగా కాకుండా ఈ పథకం అమలు చేయడానికి ముందుగా ఏయే పరిశ్రమలు, సంస్థలు, ఇతర వ్యాపారాలు అక్కడ అనువుగా ఉంటాయో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కసరత్తును ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. ఇది మంచి పరిణామం. అదేవిధంగా లబ్ధిదారుని అభిప్రాయం కూడా తీసుకుంటారు. పథకం కింద ఇచ్చే సహాయానికి ఎటువంటి బ్యాంకు లావాదేవీలు ఉండవు. నేరుగా లబ్ధిదారునికే ఆ సాయం అందుతుంది. ఇది ఈ పథకంలో ఉన్న మరొక మంచి విషయం. సహాయం అందిన తర్వాత వాళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించాలి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో గతంలో లాగా లబ్ధిదారుడు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా అవాంతరమొస్తే స్థానిక అధికారుల సహాయం కోరవచ్చు. అంటే ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది. సలహాలు కూడా ఉంటాయి. ఈ పథకాన్ని ప్రస్తుతం నిర్ణయించిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు జరిగిన తీరుపైన ఆధారపడి మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి మార్పులు, చేర్పులు చేస్తారు. అంతేకాకుండా ఈ పథకంలో భాగమైన కుటుంబం ఏదైనా కొన్ని కారణాల రీత్యా దెబ్బతింటే, వారిని ఆదుకోవడానికి లబ్ధిదారుల భాగస్వామ్యంలో ఏర్పడిన రక్షణ నిధి వారిని మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవడమనేది కూడా మరో కొత్త విషయం. ఇది కూడా ఒక దూరదృష్టి కలిగిన నిర్ణయం. ఇటువంటి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు తిరస్కరించే పద్ధతిలో కాకుండా, సమర్థవంతంగా అమలు చేయడానికి కావల్సిన సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

ఈ పథకం గురించి ప్రభుత్వం ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నదో, అంతే తీవ్రంగా దళితులు, శ్రేయోభిలాషులు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసే పర్యవేక్షణ, సలహాలు, నైతిక మద్దతుతో పాటు, దళిత లబ్ధిదారుల పక్షాన నిలబడటానికి, వాళ్లు నిలదొక్కుకోవడానికి దళిత ఉద్యోగులు, రిటైర్డ్‌ అయి అనుభవం కలిగిన పెద్దలు ముందుకు రావాలి. దీనిని ఒక ముఖ్యమైన ఘట్టంగా భావించాలి. ముఖ్యంగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈ పథకం నూటికి నూరుపాళ్లు విజయవంతం కావడానికి ఈ మద్దతు అనివార్యం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను.

కాలం వేగంగా కదులుతున్నది. సాంకేతికత, పారిశ్రామిక విజ్ఞానం కన్ను తెరిచి చూసేలోగా ఎన్నో మార్పులకు గురవుతున్నది. హుజూరాబాద్‌లో అందజేసే యూనిట్లు రాబోయే 30 ఏండ్ల మార్పులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఇవ్వాలి. ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. దళిత వర్గాల్లోని పెద్దలు, సాంకేతిక నిపుణులు, ఆర్థికవేత్తలు మనసు పెట్టి ఈ పథకం అమలును విజయవంతం చేయడానికి పూనుకోవాలి. ఇటువంటి వినూ త్న పథకాన్ని తీసుకొస్తున్న కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం.

‘నియంతృత్వ పోకడలు ప్రబలకుండా, ప్రజల భాగస్వామ్యంలో పరిపాలన సాగడానికి ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ లక్ష్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకుంటున్నాం. అందుకోసం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధనంగా ఎంచుకున్నాం. అయితే అది ఒక్కటే సరిపోదు. ప్రభుత్వాలు ప్రజల ఓట్ల ద్వారా గెలిచి, ఏదో నామ మాత్రమైన పాలన సాగించడం కాకుండా, ప్రజల అభ్యున్నతి ఆశయంగా ఆదర్శప్రాయమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి’

  • భారత రాజ్యాంగ సభలో ఆదేశిక సూత్రాల్లోని 38వ ఆర్టికల్‌ పై జరిగిన చర్చలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చేసిన వ్యాఖ్యలివి.

మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana