శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 19:31:20

బ‌తికి ఉన్నంత‌వ‌ర‌కు మీ సేవ చేస్తా : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

బ‌తికి ఉన్నంత‌వ‌ర‌కు మీ సేవ చేస్తా : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

సిద్దిపేట : ఊపిరి ఉన్నంత వ‌ర‌కు, బ్ర‌తికున్నంత వ‌ర‌కూ సిద్దిపేట జిల్లా చందలాపూర్ గ్రామానికి సేవ చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. చందలాపూర్ గ్రామంలో రూ.14.18 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి హ‌రీశ్‌రావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంగ‌నాయ‌క సాగ‌ర్ ప‌ర్యాట‌కాభివృద్ధిలో భాగంగా ల‌క్ష్మి గ్రామ‌మైన‌టువంటి చంద‌లాపూర్ అద్భుత‌మైన ప‌ర్యాట‌క కేంద్రంగా మార‌నున్న‌ట్లు తెలిపారు.

ఇటీవల సీఎం కేసీఆర్ రంగనాయక సాగర్ పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందేన‌న్నారు. దీంతో ఈ గ్రామస్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించ‌నున్న‌ట్లు తెలిపారు. రూ.9.24 కోట్ల రూపాయలతో ఇవాళ‌ డబుల్ రోడ్డు నిర్మాణ  పనులు ప్రారంభించుకున్నాం. చందలాపూర్ దేవాలయాల అభివృద్ధికి రూ. కోటి ని‌ధులు మంజూరు చేశాం. వీటిలో ఎల్లమ్మ దేవాలయానికి రూ.50 లక్షలు, రంగనాయక స్వామి దేవాలయ అభివృద్ధికి మరో రూ.50 లక్షలు కేటాయించిన‌ట్లు చెప్పారు. రంగనాయక స్వామి దేవాలయం 800 ఏండ్ల  చరిత్ర కలిగిన దేవుడన్నారు. పర్యాటక ప్రదేశంగా ఎంతో అభివృద్ధి చెందుతుంద‌న్నారు.

స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మొదటి అవకాశం ఈ గ్రామానికి ఇస్తామ‌న్నారు. గతంలో మీ చెమట చుక్కలు, మీ కష్టమంతా బోరుబావులలోనే పోశారని.. ఇక నుంచి ఆ బాధలు తప్పినయ్ అన్నారు. ప్లాస్టిక్ రహిత చందలాపూర్‌లో భాగంగా గ్రామంలో స్టీల్ బ్యాంకును త్వరలోనే ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.  గ్రామానికి కొత్త ఏఎన్ఎం సబ్ సెంటరు మంజూరు చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.