సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 15:29:39

మహిళల రక్షణలో రాజీ పడం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మహిళల రక్షణలో రాజీ పడం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైద‌రాబాద్ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పుర్రె మమత హత్య కేసులో దోషుల‌కు కఠినంగా శిక్ష పడేలా చూస్తామ‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదే విషయంపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు. మమత హత్య కేసు దర్యాప్తును స్థానిక ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ సైతం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న‌ట్లు తెలిపారు.

న్యావనందిలో హత్యకు గురైన పుర్రె మమత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ యాదవ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు నేడు హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో రాజీ పడేది లేదన్నారు. మమత హత్య కేసు దర్యాప్తులో ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా సీపీ కార్తికేయను కోరారు. మహిళలపై నేరాలను సీఎం కేసీఆర్ ఉపేక్షించరని నిందితులు ఎంతటివారైనా శిక్ష తప్పదన్నారు‌. మమత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, ఇతర నాయకులు ఎమ్మెల్సీ కవితను క‌లిసిన వారిలో ఉన్నారు.