బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 18:35:56

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలనూ ప్రోత్సహించాలి

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలనూ ప్రోత్సహించాలి

మహబూబ్‌నగర్‌: రైతుబంధు సమితులు రైతులతో వ్యవసాయంతో పాటు, ఉద్యాన పంటలు, గొర్రెలు, మేకలు, చేపలను పెంచేలా ప్రోత్సహించాలని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రైతు బంధు సభ్యులు, మండల స్థాయి కోఆర్డినేటర్‌లతో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుబంధు సభ్యులు వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అంతేకాక ప్రతిరోజు వార్తాపత్రికలు, టీవీ ఛానలెళ్లు, ఇంటర్నెట్‌ ద్వారా వ్యవసాయంపై వచ్చే విషయాలను కూడా చదివి అవగాహన చేసుకోవాలని, రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ఉండాలన్నారు. 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని మిగతా 30 శాతం పూర్తయితే జిల్లా అంతటికీ సాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటికే చెరువుల్లో నీరు నిల్వ ఉంటున్నదని, భూగర్భ జలాలు పెరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఈ రబీలో పండించిన దాదాపు 65 శాతం ధాన్యాన్ని భారత ఆహార సంస్థకు తెలంగాణ నుండి ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ యాదయ్య , డీసీసీ అధ్యక్షులు నిజాం పాషా, ఉపాధ్యక్షులు వెంకటయ్య, అదనపు కలెక్టర్‌ మోహన్‌ లాల్‌, రైతు బంధు జిల్లా అధ్యక్షులు గోపాల్‌ యాదవ్‌, డీసీఎంఎస్‌ అధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి , వ్యవసాయ శాఖ జేడీ సుచరిత తదితరులు హాజరయ్యారు.


logo