శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 01:17:01

భర్త మృతదేహంతో మూడ్రోజులు

భర్త మృతదేహంతో మూడ్రోజులు

  • మతిస్థిమితంలేని భార్య జాగారం

 నిజామాబాద్‌ సిటీ: అనారోగ్యంతో ఓ వృద్ధుడు మృతిచెందగా.. మతిస్థిమితం లేని అతని భార్య మూడ్రోజులపాటు శవంతోనే జాగారంచేసింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన లింబారెడ్డి(70) వీఆర్వోగా పని చేసి పదేండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య శకుంతల, కుమారుడు సంతోష్‌రెడ్డి, కూతురు స్వప్న ఉన్నారు. సంతోష్‌రెడ్డి హైదరాబాద్‌లో, కూతురు లండన్‌లో ఉంటున్నారు. శకుంతల కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నది. ఈ క్రమం లో అనారోగ్యంతో బాధపడుతున్న లింబారెడ్డి ఈ నెల 10న ఇంట్లోనే మృతిచెందాడు. తన భర్త నిద్రపోతున్నాడని అనుకొని శకుంతల మూడ్రోజులుగా మృతదేహంతో ఉన్నది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వారు హైదరాబాద్‌లో ఉంటున్న సంతోష్‌రెడ్డికి చెప్పారు. దీంతో ఆయన బుధవారం ఇంటికి వచ్చిచూడగా తన తండ్రి మృతి చెందిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎస్సై ప్రభాకర్‌ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.


logo