బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:43:17

భర్త హత్యకు సుపారీ..

భర్త హత్యకు సుపారీ..

  • ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
  • అల్వాల హత్య కేసులో సుపారీ కోణం
  • భార్యసహా ఐదుగురి అరెస్టు.. రిమాండ్‌

కేశంపేట: నిత్యం అనుమానించే మొగుడి వేధింపులు తాళలేక ఓ భార్య బంధువులతో కలిసి భర్తను అంతమొందించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకొనే ప్రయత్నంచేసింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాలలో డిసెంబర్‌ 30న జరిగిన సుపారీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను కటకటాల వెనక్కు పంపారు. కేశంపేట ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. అల్వాల గ్రామ పరిధిలోని ఎర్రగడ్డతండాకు చెందిన పాత్లావత్‌ చంద్రునాయక్‌ (45)కు ఐదుగురు భార్యలు. గ్రామానికి చెందిన యాదమ్మ హత్య కేసులో అతను ఏడేండ్ల శిక్ష అనుభవించి రెండేండ్ల క్రితం విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మూడో భార్య అనితతో ఉంటున్నాడు. ‘నేను జైలులో ఉన్నప్పుడు ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. నిన్ను కూడా చంపేస్తా’ అని చంద్రు నిత్యం భార్యను బెదిరించేవాడు. భర్త వేధింపులు భరించలేక అనిత బాలానగర్‌ మండలం రంగారెడ్డిగూడలో ఉంటున్న తన అక్క కొడుకు పాత్లావత్‌ మోహన్‌కు తన గోడును వెళ్లబోసుకున్నది. చంద్రును అడ్డుతొలిగిస్తే ఏమిస్తావని మోహన్‌ అడుగగా.. భర్త నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి 2.20 ఎకరాల్లో ఎకరం పది గుంటలు ఇస్తానని హామీ ఇచ్చింది. రూ.10 వేలు మోహన్‌ చేతిలోపెట్టింది. పథకం ప్రకారం.. డిసెంబర్‌ 30న చంద్రుకు మోహన్‌ ఫోన్‌చేసి వేములనర్వకు పిలిచాడు. అక్కడ ఏదో మాట్లాడినట్టు నటించి వెనక్కి పంపించారు. అనంతరం అనిత, మోహన్‌, సబావట్‌ బాలు, పాత్లావత్‌ వేణు, సబావట్‌ మోతిలాల్‌ కలిసి వేములనర్వ నుంచి అల్వాలకు వెళ్లే దారిలో చంద్రును రాడ్డుతో తలపై కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. చంద్రు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై మృతుడి తండ్రి భద్రుకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను విచారించగా హత్య బయటపడింది.  


logo