మాడ్రిడ్, జూన్ 24: మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త జాన్ మెకాఫీ (75) బుధవారం బార్సిలోనా జైలులోని తన సెల్లో విగతజీవిగా పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. మెకాఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్ కోర్టు అంగీకరించిన కొద్దిగంటలకే ఆయన బలన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. అమెరికాలో ఆయనపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువైతే చాలా ఏండ్ల పాటు ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న ఆందోళనతోనే ఆయన ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. మెకాఫీ మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత ఏడాది కిందట ఆయన పోస్టు చేసిన ట్వీట్ ఒకటి తిరిగి తెరపైకి వచ్చింది. ‘ఎప్స్టీన్లా నేను ఉరి వేసుకుంటే అది నా తప్పు కాదు’ అని మెకాఫీ అప్పట్లో ట్వీట్ చేశారు.