ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:57

వీరుడా.. వీడ్కోలు

వీరుడా.. వీడ్కోలు

  • నాన్నకు ప్రేమతో..
  • సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు
  • కేసారంలోని సొంతస్థలంలో చితికి నిప్పంటించిన తండ్రి
  • అంతిమయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు
  • భవనాలపై నుంచి పూలు చల్లుతూ తుది వీడ్కోలు
  • సంతోష్‌ అమర్హ్రే అంటూ హోరెత్తిన నినాదాలు

‘మా డాడీ వెరీ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ పర్సన్‌. ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌. లఢక్‌ వద్ద చైనా సోల్జర్స్‌తో ఫైట్‌చేస్తూ చనిపోయినట్టు చెప్పారు. మా మమ్మీ, నేను చాలా ఏడ్చాం. విపరీతమైన బాధేస్తున్నది. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పేవారు.. అందుకే కంట్రోల్‌ చేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా నాన్న ఫొటోలు కనిపిస్తున్నాయి. మీడియాలో నాన్న గురించే చెప్తున్నారు. దీంతో గర్వంగా కూడా ఉంది’


సూర్యాపేట, నమస్తే తెలంగాణ: దేశంకోసం ప్రాణత్యాగం చేసిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సైనికలాంఛనాలతో ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు, భారీగా తరలివచ్చిన ప్రజలు దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ అమరవీరుడికి వీడ్కోలు పలికారు. సంతోష్‌బాబు ఇంటినుంచి ఐదు కిలోమీటర్లమేర రోడ్డుకిరువైపులా నిల్చున్న ప్రజలు ‘సంతోష్‌బాబు అమర్హ్రే.. వీరుడా నీ ఆశయం గొప్పది.. నీ త్యాగం చిరస్మరణీయం’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో కేసారంవద్ద ఉన్న సొంతస్థలంలో తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ అమరవీరుడి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. 

ఉదయం తొమ్మిది గంటలకు సూర్యాపేట పట్టణం విద్యానగర్‌లోని సంతోశ్‌బాబు నివాసం వద్ద ఆర్మీ అధికారులు కవాతు, సలామీ నిర్వహించగా.. కుటుంబసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి.. తెలంగాణ తల్లి విగ్రహం, శంకర్‌విలాస్‌సెంటర్‌, కోర్టు చౌరస్తా, మున్సిపల్‌ కాంప్లెక్స్‌, ఎస్పీ కార్యాలయం నుంచి కేసారం వరకు సుమారు ఆరు కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. అమరవీరుడిని చివరిచూపు చూసేందుకు జిల్లావ్యాప్తంగా వేలమంది ప్రజలు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

మిలిటరీ లాంఛనం.. హిందూ సంప్రదాయం

కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటుచేసిన చితిపైకి మిలిటరీ అధికారులు సంతోష్‌బాబు పార్థివదేహాన్ని చేర్చారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది గన్‌డౌన్‌ చేసి.. అమరవీరుడికి సెల్యూట్‌ చేస్తూ కవాతు నిర్వహించారు. అనంతరం మూడురౌండ్లు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం సంస్కారాలు నిర్వహించారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషి కుమారుడిని ఎత్తుకుని మామ ఉపేందర్‌తోపాటు భర్త చితిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. తండ్రి ఉపేందర్‌ సంతోష్‌ చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తిచేశారు. 

దేశభక్తి ముందు తలవంచిన కరోనా భయం

కరోనా వ్యాప్తి వేళ జనం గుమికూడవద్దని హెచ్చరికలు ఉన్నా దేశభక్తి ముందు అవి నిలబడలేదు. సంతోష్‌బాబును కడసారి చూసేందుకు వేలమంది తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా రోడ్డుకిరువైపులా పెద్దసంఖ్యలో నిలబడి నినాదాలు చేశారు. పూలవర్షం కురిపించారు. జాతీయజెండాలు పట్టుకుని భారత్‌ మాతాకీ జై.. సంతోష్‌బాబు అమర్హ్రే.. జైజవాన్‌ జైకిసాన్‌ నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, గాదరి కిశోర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నీ చివరి యాది మరువనయ్యా..


బరువెక్కిన హృదయాలు.. భారతమాతకు జేజేలు.. దేశంకోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం.. చిన్నారులను ఒంటరి చేసి వెళ్లిపోయాడనే బాధ.. నరనరాన దేశభక్తి నిండిన కుటుంబం.. కరోనాను కూడా లెక్కచేయకుండా జాతీయజెండాలను పట్టుకుని కదిలివచ్చిన జనం వీడ్కోలు మధ్య కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రహదారికిరువైపులా నిలబడిన ప్రజలు పూలవర్షం కురిపిస్తూ.. సంతోష్‌బాబు అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తుండగా.. స్వగృహం నుంచి సొంతపొలం వరకు ఐదుకిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. సూర్యాపేట సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన జవాన్లు వందనం సమర్పించగా.. భార్య సంతోషి, కుమారుడు అనిరుధ్‌తో కలిసి తండ్రి ఉపేందర్‌ అమరవీరుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.



logo