శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 03:00:39

కుండపోత

కుండపోత

  • పలు జిల్లాల్లో విస్తారంగా వానలు 
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం 
  • అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 19 సెంటీ మీటర్లు నమోదు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల పంట పొలాలు సైతం నీటమునిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగర శివారులోని ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. అత్యధికంగా నందిగామలో 19 సెంటీమీటర్లు, ఫరూఖ్‌నగర్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగామ మండలం ఈదులపల్లిలోని కోళ్లఫారంలో 10 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. మొయినాబాద్‌ మండం కేబీ దొడ్డి గ్రామంలోకి ఈసీ వరద వచ్చింది. కొందుర్గు మండలంలో విశ్వనాథ్‌పూర్‌కు చెందిన జహంగీర్‌ వాగుదాటుతుండగా వరదలో కొట్టుకుపోయాడు. కేశంపేట మండలం దేవుని గడ్డకు చెందిన రాము వాగు దాటుతుండగా మూర్ఛ రావడంతో మృతి చెందాడు. మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వికారాబాద్‌ జిల్లాలోని కాగ్నా నది వరదనీటితో జీవన్గిలోని మహాదేవ లింగేశ్వరాలయం కొంత మేర నీటమునిగింది.  తాండూరు మండలం బెల్కటూరులో వాగు పెద్ద ఎత్తున పారుతుండటంతో పురిటినొప్పులతో వచ్చిన ఓ గర్భిణిని ఎత్తుకొని వాగు దాటించాల్సి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. 1137 చెరువులు అలుగుపోస్తున్నాయి. మరో 722 చెరువులు నిండాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 18.8 , మునగాలలో 16.1, కోదాడలో 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నిలిచిన రాకపోకలు 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లాలోని పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మధ్యతరహా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌ చెరువు మత్తడి దుంకుతుండటంతో ప్రధాన రహదారిపై ఒక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌-కాంజీపూర్‌ మధ్య వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పత్తి, మిర్చి పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 17.93 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం గొండ్యాలకు చెందిన కావలి రాములు (55) వాగును దాటే క్రమంలో కొట్టుకుపోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో ఊరి పక్కనే ఉన్న చింతకుంట చెరువుకు గండి పడటంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు.