ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:18:17

సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు?

సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు?

‘సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడానికి హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉన్నదా?, మనమేమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా?, బీజేపీ నేతలకు దమ్ముంటే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి’ 

  • మనమేమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా?
  • ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/అమీన్‌పూర్‌: హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్‌ అభ్యర్థులు పుష్పానగేష్‌ యాదవ్‌, సింధూ ఆదర్శరెడ్డిలకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే 6.60 లక్షల కుటుంబాలకు వరద సాయాన్ని అందించిందని తెలిపారు. నోటికొచ్చినట్లు మాట్లాడి హైదరాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, సేఫ్‌ సిటీగా మార్చారని, గడచిన ఆరేండ్లలో ఇక్కడ గూండా, దాదాగిరీలు, ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. ఈ క్రమంలోనే అమెజాన్‌ వంటి భారీ సంస్థ రూ.21 వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. ముంబైలో కాలుష్యం పెరిగిందని, బెంగళూరు, చెన్నైలో రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోయిందని, మంచి నీళ్లు లేక చెన్నైలో ఐటీ సంస్థలు, స్టార్‌ హోటళ్లు మూతపడిపోతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి, మంజీర జలాలను తీసుకువచ్చి నీటి సమస్య లేకుండా చేశారన్నారు. ‘ఒకడు సర్జికల్‌ స్ట్రైక్‌ అంటే.. మరొకడు దారుస్సాలెం కూల్చేస్తానంటాడు. ఇంకొకడు పీవీ నరసింహరావు సమాధి కూల్చేస్తామని అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు..?, బోడి గుండుకు మోకాలికి లంకెపెడుతున్నారు’ అని మంత్రి హరీశ్‌రావు బీజేపీ, ఎంఐఎం నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లింల మధ్య పంచాయతీలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్న ఆ పార్టీలకు గ్రేటర్‌ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర సర్కారు నుంచి స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేమని ఓ వైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతుండగా.. అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు వాగ్దానాలు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నగర అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారని బీజేపీ నాయకులకు ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, కార్మిక నాయకుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.