శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 20:48:02

మనని పట్టించుకోని వారికి ఓటేందుకు వేయాలి : మంత్రి కేటీఆర్‌

మనని పట్టించుకోని వారికి ఓటేందుకు వేయాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : కర్ణాటకలో వరదలొస్తే ఆ రాష్ట్ర సీఎం ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం నాలుగో రోజే రూ.669 కోట్లు విడుదల చేసింది. గుజరాత్‌లో వరదలొస్తే ప్రధాని స్వయంగా హెలికాప్టర్ల వీక్షించి రూ.500 కోట్లు విడుదల చేశారు. అదే హైదరాబాద్‌కు వరదలొస్తే సీఎం లేఖ రాసినా కనీసం పట్టించుకోలేదు. హైదరాబాద్‌ భారతదేశంలో లేదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. మనని పట్టించుకోని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీరాంనగర్‌ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో హైదరాబాద్‌ను అభివృద్ధిబాటలో ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. బోరబండ డివిజన్‌ నుంచి బాబా ఫసియుద్దీన్‌ బాబా, రహ్మెత్‌నగర్‌ నుంచి సీఎన్‌ రెడ్డి, ఎర్రగడ్డ డివిజన్‌ నుంచి పల్లవి మహేందర్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.

ఆరేళ్ల కిందట ఎన్నో అనుమానాలు, సందేహాలు, ప్రత్యర్థులు సృష్టించిన భయాందోళనలను పటాపంచలు చేశామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించాలన్నారు. శాంతియుతంగా ఒకరితో ఒకరం కలిసి ముందుకుసాగుతున్నామన్నారు. అందరికి తానొకటే విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బీజేపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే ఏం ఇచ్చింది మీ బీజేపీ హైదరాబాద్‌కు.. ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నరని ప్రశ్నించాల్సిందిగా కోరారు. అరాచకశక్తులను తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు.