బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 16:21:35

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు లేవు?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు లేవు?

కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై రూ.3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్ శంకుస్థాపనతో పాటు రూ.5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.

ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఎల్లారెడ్డిలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (అధికారిక భవనం) ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆర్ అండ్ బీ శాఖ తరుఫున మరికొన్ని నూతన రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా సమస్యలు సత్వర పరిష్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారన్నారు.


ఇటీవల కొంతమంది కేసీఆర్ ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, 2016 రూ. ఆసరా పెన్షన్ లాంటివి..బీజేపీ అధికారంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. 


బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మెరుగైన సంక్షేమ పథకం చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుల్ని ఈ విషయంపై ప్రజలు ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.logo