శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:59

మాస్క్‌.. ప్రాణానికి పహారా

మాస్క్‌.. ప్రాణానికి పహారా

 • గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందన్న డబ్ల్యూహెచ్‌వో
 • కరోనా దరిచేరొద్దంటే కవచం తప్పనిసరి
 • సరైన రీతిలో ధరించకపోతే ప్రమాదమే 
 • నిర్లక్ష్యం వహిస్తే కొంపముంచుతుంది

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నుంచి రక్షణకు మాస్క్‌లు ఆయుధాలుగా పనిచేస్తాయి. వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు లేనిదే గడప దాటే పరిస్థితిలేదు. మాస్క్‌ జీవితంలో ఒక భాగమైంది. ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడికి కవచ కుండలాలు ఎట్లనో మనిషికి వైరస్‌ను అడ్డుకోవడానికి మాస్కులు రక్షణ కవచాలు పనిచేస్తున్నాయి. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నదని కూడా డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకే మాస్క్‌ వాడకం తప్పనిసరిగా మారింది. ఇంతటి ప్రధానమైన మాస్కులను ఎలా వాడాలి. వాడటంలో తేడా వస్తే ఏమిటి? అసలు ఎన్నిరకాల మాస్కులు మనకు రక్షణ ఇస్తాయి? అనేది ఇంకా చాలామందికి అవగాహన రావాల్సిన అవసరమున్నది.

మాస్క్‌ ఆయుధం లాంటిదైనా దానిని వాడే విధానం తెలియకపోతే కరోనా కాటు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కవచాన్ని సరైన రీతిలో వినియోగిస్తేనే అజ్ఞాత శత్రువు కరోనా నుంచి తప్పించుకోవచ్చు. అయితే చాలామంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ముఖానికి ఏదో మొక్కుబడిగా మాస్క్‌ తగిలించుకొని తిరుగుతున్నారు. ఆ నిర్లక్ష్యమే కొంప ముంచుతుందని వైద్యులు వాపోతున్నారు. సరైన రీతిలో మాస్క్‌ ధరించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం లేకపోలేదని, ప్రస్తుతం అదే జరుగుతున్నదని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మాస్క్‌ను నామ్‌కే వాస్తే ధరిస్తున్నారు. ముక్కుకు కింది భాగంలో కేవలం నోరు భాగాన్ని కవర్‌ చేసేలా ధరిస్తుండగా, మరికొందరు ఏకంగా మాస్క్‌ను గడ్డానికి మొక్కుబడిగా పెట్టుకొంటున్నారు. ఇలా అయితే మాస్క్‌ పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా ఒకటేనని వైద్యులు చెప్తున్నారు.

మాస్క్‌ మంచిగ చూసుకోకపోతే రిస్కే..

మాస్క్‌ను మంచిగ చూసుకోకపోతే చాలా ప్రమాదమని, మాస్కులను సరిగ్గా ధరించకపోయినా, ఎక్కువసేపు ధరించినా ఆరోగ్యానికి ప్రమాదమేనంటున్నారు నిపుణులు. చికాకు, ఉక్కపోతతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట. మాస్క్‌ ఉందికదా అని కరోనా రోగులతో కలిసి తిరగకూడదట. వ్యాధిగ్రస్థులు తుమ్మినా, దగ్గినా 3 అడుగుల దూరంవరకు తుంపర్లు పడుతాయని, నాణ్యమైన మాస్క్‌లు కూడా వాటిని అడ్డుకోలేకపోవచ్చని వర్సిటీ ఆఫ్‌ నికోసియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్‌-95తోపాటు సర్జికల్‌, బట్ట మాస్కులు ధరించినా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ మాస్కులు ముక్కును, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలని చెప్పారు. వాటిని పెట్టుకొనే సమయంలో, తీసే సమయంలో తాడును మాత్రమే ముట్టుకొంటూ ఉపయోగించాలని పేర్కొన్నారు.

మాస్కుల్లో రకాలు

కరోనా ప్రభావంతో మార్కెట్లో రకరకాల మాస్క్‌ లు అందుబాటులోకి వచ్చాయి. జనం మధ్య తిరిగేవారు మాత్రం ఎన్‌- 95 మాస్క్‌లు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం త్రీఫ్లై (మూడు పొరల) మాస్క్‌ను ధరించాలని చెప్తున్నారు. ఈ రెండూ లేనిసమయంలో సర్జికల్‌ లేదా క్లాత్‌ మాస్క్‌నైనా ధరించాలని, ముఖానికి ఏదో ఒక తెర అడ్డుగా లేకుండా బయటికి వస్తే, మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎన్‌-95 మాస్క్‌లతో పూర్తి రక్షణ


ఎన్‌-95 మాస్క్‌లతో దాదాపు 99 శాతం రక్షణ ఉంటుంది. ఇవి కొంచం ఖరీదైనప్పటికీ వైరస్‌ నుంచి దాదాపు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉన్న సన్నటి పొరలు వైరస్‌ను ముక్కు, నోటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేసే వైద్యులు, పోలీసులు, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, జర్నలిస్టులకు ఈ మాస్క్‌లు తప్పనిసరి. ముఖ్యం గా యువత మాస్క్‌ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నోటికి, గడ్డానికే పరిమితంచేస్తున్నారు. వైరస్‌ అనేది రోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లద్వారా వ్యాపించే ప్రమాదం అధికం. దీని నుంచి రక్షణకు మనం మాస్క్‌లను ధరిస్తున్నామనే విషయాన్ని మరువకూడదు.

- డాక్టర్‌ బీ నాగేందర్‌, ఉస్మానియా దవాఖాన సూపరిం టెండెంట్‌

 • మాస్క్‌ ఇలా ధరించాలి మాస్క్‌ను ముక్కు, నోరు రెండూ పూర్తిగా కవర్‌ అయ్యేలా ధరించాలి.
 • మాస్క్‌ ధరించిన తర్వాత తరచూ చేతులతో తాకరాదు. 
 • అలా తాకడం వల్ల చేతులకు ఉన్న వైరస్‌ మాస్క్‌ ద్వారా శరీరంలోకి వెళ్తుంది.
 • మాస్క్‌ నాడలను పట్టుకొని తీయడం, పెట్టుకోవడం చేయాలి. మాస్క్‌ను తాకేముందు చేతులను శానిటైజ్‌చేసుకోవాలి.
 • ముక్కు కింద మాస్క్‌ను ధరించరాదు.
 • మాస్క్‌ను గడ్డం కింద మొక్కుబడిగా పెట్టరాదు.
 • సర్జికల్‌ మాస్క్‌ను కేవలం 6 గంటలు మాత్రమే వినియోగించాలి.
 • క్లాత్‌ మాస్క్‌ కనీసం మూడు పొరలుగా ఉండేలా చూసుకోవాలి. అది ముక్కు, మూతి పూర్తిగా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.

తాజావార్తలు


logo