e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home Top Slides దళిత బంధును ఎవరాపగలరు?

దళిత బంధును ఎవరాపగలరు?

  • ఆరు నూరైనా ఈ పథకం కొనసాగుతుంది
  • అవసరాన్ని బట్టి లక్ష కోైట్లెనా ఖర్చుచేస్తాం
  • దళితబంధుతో కొందరిపై బాంబుపడ్డట్టయింది
  • ఏడాది క్రితమే అమలుకావాల్సిన పథకం ఇది
  • అన్నివర్గాల ప్రజలనూ అభివృద్ధిలోకి తెస్తున్నాం
  • ఎవరూ అడుగకున్నా పథకాలు పెడుతున్నాం
  • మానవీయకోణంలో అందరికీ పీఆర్సీ ఇచ్చాం
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి
  • టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి
  • కాంగ్రెస్‌ నేత స్వర్గం రవి కూడా గులాబీగూటికి

కాళ్లు చేతులు మాత్రమే ఆస్తిగా ఉన్న లక్షల దళిత కుటుంబాలు ఉన్నయి. వాళ్లు పైకి రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. సంపద పెంపులో భాగంగా వచ్చిందే మన దళితబంధు. ఈ పథకం మహాయజ్ఞం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవచేసి, మెప్పించి, అధికారం సాధించి, దాన్ని సద్వినియోగం చేయాలి. అదీ డెమోక్రసీలో జరగాల్సిన పని. అంతే కానీ గోల్‌మాల్‌ చేసి, గారడీ మాటలు చెప్పకూడదు. నాకు ఆ అవసరం కూడా లేదు. నేను వందశాతం చెప్తున్నా ఎన్నో రాష్ర్టాలు, కొన్నాళ్లు పోతే కొన్ని దేశాలు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని పోతాయి.సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితుల సమగ్రాభివృద్ధికోసం బృహత్‌ సంకల్పంతో రూపొందించిన దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన దళితుల జీవితాలను పూర్తిగా మార్చివేసేందుకే ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఈ పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు. దళిత బంధు పథకం పేరు వినగానే కొందరు బాంబు పడ్డట్టు అదిరిపడుతున్నారని, ఎందుకంత భయమో అర్థం కావట్లేదన్నారు. నిజానికి ఏడాదిన్నర క్రితమే ఈ పథకం అమల్లోకి రావాల్సి ఉన్నదని, కరోనా కారణంగా ఆలస్యమైందని సీఎం చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరెడ్డితోపాటు టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి స్వర్గం రవిలకు సీఎం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల రూపకల్పన, అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శనం చేస్తున్నదని తెలిపారు. సీఎం ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

- Advertisement -

లక్షకోట్లయినా వెనుకాడం..
దళిత బంధు అమలుకు లక్ష కోట్లు అవసరమైనా వెనుకాడం. వందశాతం అమలు చేసి తీరుతం.. పథకాన్ని ఎట్ల అమలు చేయాలి? ఏడాదికి రెండు లక్షల కుటుంబాలా? నాలుగు లక్షల కుటుంబాలా? అనేది మన ఆర్థిక పరిమితులను బట్టి నిర్ణయిస్తం. మిగతావాళ్ల సమస్యలను కూడా అడ్రస్‌ చేసుకుని ఇక్కడికి వెళదామనుకున్నాం. ఇప్పుడు కరెక్ట్‌గా ల్యాండ్‌ అయినం. ఎందుకంటే దళితుల జనాభా ఎక్కువ ఉన్నది. ఎక్కువ డబ్బులు అవసరం. రాష్ట్రంలో దళితుల జనాభా సరిగ్గా లెక్కలు తీస్తే ప్రస్తుతం 18-19 శాతం ఉంటది. అందుకే రూ.లక్ష కోట్లయినా దళితబంధు కోసం ఖర్చుపెడతామని చెప్పిన. అది కొందరికి జీర్ణం అయితలేదు. ఉక్కిరిబిక్కిరై పరేషాన్‌ అయిపోతున్నరు. ఎందుకు అట్ల ఆగమైతున్నరు? అసెంబ్లీలో గతంలో ఒక పార్టీ నేత మాట్లాడితే.. ‘నీకు అర్థమైతలేదు.. ఇంకా నా దగ్గర రెండుమూడు స్కీంలు ఉన్నాయి. అవి అమలుచేస్తే మీరు పోయినట్టే బిడ్డా’ అని చెప్పిన. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవచేసి, మెప్పించి, అధికారం సాధించి, దాన్ని సద్వినియోగం చేయాలి. అదీ డెమోక్రసీలో జరగాల్సిన పని. అంతే కానీ గోల్‌మాల్‌ చేసి, గారడీ మాటలు చెప్పకూడదు. నాకు ఆ అవసరం కూడా లేదు. నేను వందశాతం చెప్తున్నా ఎన్నో రాష్ర్టాలు, కొన్నాళ్లు పోతే కొన్ని దేశాలు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని పోతాయి.

సమగ్ర అధ్యయనం తర్వాతే..
ఎనకట చారి అని నా మిత్రుడు ఆంధ్రభూమి రిపోర్టర్‌ ఉండె. ఆయన, నేను, ఇంకొందరు మిత్రులు కలిసి చాలారోజుల క్రితం సెంటర్‌ ఫర్‌ సబ్‌ఆల్టర్న్‌ స్టడీస్‌ అని పెట్టినం. అంటే ప్రపంచవ్యాప్తంగా అణచివేయబడిన జాతుల చరిత్ర. ఒక 165 జాతులు ఉన్నయ్‌. అనేక రకాలుగా వాళ్లను అణచివేశారు. అసలు మనిషి లోపల ఈ రాక్షస ప్రవృత్తి ఎట్లా వస్తా ఉంది? మనిషే సాటి మనిషిని అణిచివేసి పొందే రాక్షస ఆనందానికి మూలం ఏంది? దాన్ని దెబ్బకొట్టడానికి ఏమైనా ప్రక్రియలు ప్రాక్టీస్‌ చేయొచ్చా? అని అధ్యయనం చేసినం. మా అధ్యయనంలో ఇండియన్‌ దళిత్‌ కమ్యూనిటీ కూడా ఒకటి. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా ఏ ఊరు సెంటర్‌కు పోయి.. మీ ఊరిలో కడు పేదలు ఎవరు? అని అడిగితే.. దళితులు అని చెప్తరు. ఇంతకు ముందేమో మొత్తం దేశం అంతా దోచి దళితులకే పెట్టినట్లు ప్రచారం చేశారు. కానీ ఏమైంది? ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. సమాజంలో ఇంత నాగరికత పెంపొంది, మనిషి చంద్రుడి మీదకు, గ్రహాంతరాలకు పోయే సమయంలో కూడా ఇంకా దళితజాతి అట్టా మగ్గిపోవుడు కరెక్ట్‌ కాదు. మన శరీరంలో చిన్న భాగం బాగా లేకున్నా మనం నిద్రపోలేం. అది సలుపుతా ఉంటది. అట్లనే రాష్ట్రంలో, దేశంలో ఒక సెక్షన్‌ బాగా లేకపోతే అది మంచిది కాదు. దాన్ని పరిష్కరించుకొని బాగు చేసుకునే బాధ్యత మన అందరిది. ముఖ్యమైన విషయం ఇది. కొందరు లేట్‌గా గుర్తిస్తరు. గుర్తించిన కొందరు తొందరగా స్టార్ట్‌ చేస్తరు.

ఏ ఊరికి పోయినా పచ్చదనమే
ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా పచ్చటి చెట్లు కనిపిస్తాయి. ఒక ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కచ్చితంగా కనిపిస్తాయి. రోజూ చెత్త ఊడుస్తారు. రాష్ట్రంలో 12,796 గ్రామ పంచాయతీలుంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు 80 ట్రాక్టర్లే ఉన్నాయి. గత పాలకులు వట్టిగనే డైలాగ్‌లు కొట్టేది కానీ ఏర్పాట్లు లేవు.. మన ప్రభుత్వంలో అన్ని ఏర్పాటవుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపు కానీ, నెలకు రూ.300 కోట్లు ఠంచన్‌గా గ్రామపంచాయతీలకు విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శికి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చిన. ప్రతినెల రెండోతేదీన గ్రామ పంచాయతీలకు డబ్బులు రిలీజ్‌ అయినయి అని నా టేబుల్‌ మీదికి రిపోర్ట్‌ వస్తది. అట్లనే మున్సిపాలిటీల డబ్బులు రిలీజ్‌ అవుతున్నాయి. అంత మానిటర్‌ చేస్తున్నా. అందువల్లనే ఎక్కడా కార్యక్రమాలు కుంటుపడటం లేదు.

మానవీయ కోణంలో అందరికీ జీతాలు
పీఆర్సీ ఉద్యోగులకే ఇస్తారు. కానీ ‘కిందస్థాయిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వాళ్లకు కూడా జీతాలు పెంచండి.. వాళ్ల కడుపులు నిండాలి. ఉద్యోగులకు ఇచ్చినట్టే వాళ్లకు కూడా 30% ఇవ్వండి’ అని మా అధికారులకు చెప్పిన. దేశంలో మొట్టమొదటిసారి మనమే పెంచాం. తెలంగాణ వచ్చినప్పుడు ఆశ వర్కర్ల జీతం ఎంత? ఇప్పుడు ఎంత? మన రాష్ట్రంలో ఆశ వర్కర్లకు వస్తున్న జీతంలో సగం కూడా ఇతర రాష్ర్టాల్లో లేదు. జీతాల విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా హోంగార్డులకు దాదాపు రూ.50 వేల జీతం ఇస్తున్నాం. ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు బేసిక్‌పై 30% రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్నది ఒక్క తెలంగాణే. ఇది ఎవరూ మమ్మల్ని అడగలేదు. మంచి ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం ఉంటే, మానవీయ కోణంలో ఆలోచించి పకడ్బందీగా రూపకల్పన చేసి అమలు చేస్తుంది. ఇంకా చాలా చేయాల్సి ఉన్నది. గ్యారెంటీగా చేస్తాం. ప్రజలకు కూడా రోజురోజుకు మార్పు తెలుస్తున్నది. తెలంగాణ వచ్చిన తొలిరోజుల్లో చాలా కన్‌ఫ్యూజన్‌ ఉండేది. ఈ రోజు ఎన్నో విషయాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నాం. ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నది.

అన్ని వర్గాల గోస తీర్చినం..
వెయ్యి రూపాయల పెన్షన్‌ను రూ.2 వేలు చేసినం, 4 కేజీల బియ్యం పంపిణీని 6 కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ ఇవ్వాలని చెప్పినం. ప్రతి కార్మికవర్గ సమస్యపై చర్యలు తీసుకున్నాం. సమైక్య పాలనలో హైదరాబాద్‌లో గీత కార్మికుల నోట్లో మట్టికొట్టి కల్లు దుకాణాలను బంద్‌ పెట్టించారు. మేం వాటిని పునరుద్ధరించినం. చెట్ల రకం పన్ను బకాయిలను మొత్తం మాఫీ చేయడమే కాకుండా శాశ్వతంగా చెట్లపై పన్నును తీసేసినం. గీత కార్మికులకు బీమా పెట్టినం. గీత కార్మికులు, చేనేత కార్మికులు, గొర్రెల కాపర్లు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, రజక సోదరులు.. ఇలా అందరి అభివృద్ధికి ఏం చేయగలమో ఆలోచించి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంబీసీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బడ్జెట్‌ ఇచ్చినం. అన్ని వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతున్నాం.

తెలంగాణ.. ఓ కశ్మీర ఖండమే
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం కకావికలమైంది. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కరెంటు రాదు.. నీళ్లు రావు.. ఎరువులు, విత్తనాలు దొరకవు.. ఇలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. రైతులను ఆదుకునేందుకు రైతుబంధు తీసుకొచ్చినం. ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతుబీమా కల్పించినం. పోయిన సంవత్సరం కోటి ఎకరాలకు పైగా భూమి సాగైతే 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో పండింది. జోకెటోడు జోకలేక చచ్చిండు.. మోసెటోడు మొయ్యలేక సచ్చిండు. లారీలు గుంజలేక సచ్చినయ్‌. సివిల్‌ సైప్లె మంత్రి వచ్చి.. ‘సార్‌ జూలైలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలె’ అని అడిగిండు. ‘ఏందయ్యా.. జూలైలో ఎవడైనా కొనుగోలు చేస్తరా?’ అంటే.. ‘ఏం చేయమంటరు సార్‌.. ఎంత జోకినా తగ్గుతలేవు.. కొనుగోళ్లు నడుస్తనే ఉన్నయి’ అని చెప్పిండు. రాష్ట్రంలో వ్యవసాయరంగం మరింత పటిష్ఠమవుతున్నది. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఓ కశ్మీర ఖండమే అయితది. ఎవడు ఎటుపోయినా బట్టకు.. పొట్టకు చావులేని రాష్ట్రం అయితది. అద్భుతంగా బతుకుతది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.28 లక్షలు. ఇది కేంద్రంతో పోల్చితే సమారు డబుల్‌. దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రం.. ఇంకా ధనిక రాష్ట్రం అవుతది. వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా వస్తయి. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నది.

కేసీఆర్‌ ఎక్కడన్నా దోచుకొస్తుండా అన్నరు
‘ఏంది రా ఊర్లళ్లకు ఈ తరీక పైసలు వస్తున్నయ్‌.. కేసీఆర్‌ ఏమైనా దోసుకొస్తుండా ఏంది?’ అని మొదట్లో చాలామంది అనేటోళ్లు. జనాలకు అర్థం కాలేదు. పెన్షన్లు, కార్యక్రమాలు, పథకాలతో కన్ఫ్యూజ్‌ అయ్యారు. ఈ తరీకగా ఇండియాలో ఎవ్వలు ఇయ్యరు. ఓట్ల ముందు గులగులపెట్టి ఆయింత అవుతల పడ్తరు. ఇప్పటిదాకా అవ్వే నడిచినయ్‌ కాబట్టే.. ప్రజలకు విశ్వాసం లేదు. పేదింటి ఆడబిడ్డ పెండ్లయితే సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి పథకం పెట్టాలని ఎవ్వడైనా ఆలోచించిండా? కల్యాణలక్ష్మి ద్వారా మొదట రూ.51వేలు సాయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత రూ.100,016కు పెంచుకున్నాం. మహిళలు కాన్పుకోసం దవాఖానకు పోతే దిక్కుమాలిన ఆపరేషన్లు చేసి దోపిడీ చేసేవారు. ఓ సందర్భంగా దీనిపై చర్చవస్తే ఓ ఐదారుగురు ఐఏఎస్‌లను కొన్ని రాష్ర్టాలు తిరిగి అక్కడ ఏం జరుగుతుందో చూసిరమ్మన్నం. వారు ఇచ్చిన రిపోర్టుకు మెరుగులు దిద్ది, అమ్మ ఒడి అనే వాహన సదుపాయం కల్పించాం, కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 25-26 శాతమే ఉండేది. ఈ రోజు 60 శాతానికి పెరిగాయి. ప్రభుత్వం తనకు తానుగా ఆలోచించి ఎక్కడ ఏం చేయాలో ఆలోచించి అక్కడ అది చేసుకుంటా ముందుకు పోతున్నాం.

కేసీఆర్‌ వేరే విధంగా రుజువు చేసుకున్నరు
పొత్తూరి వెంకటేశ్వర్‌రావు అని సీనియర్‌ జర్నలిస్టు ఉండె. ఆయన పుట్టినరోజున నేను ఇంటికే పోయి శుభాకాంక్షలు చెప్పిన. అప్పుడు ఆయన నాతో ‘విన్‌స్టన్‌ చర్చిల్‌ అని బ్రిటన్‌ ప్రధానమంత్రి. ఆయన వార్‌ ప్రైమ్‌మినిస్టర్‌గా చాలా సూపర్‌హిట్‌ అయ్యారు. కానీ రెగ్యులర్‌ ప్రైమ్‌మినిస్టర్‌గా ఫెయిల్‌ అయిపోయిండు. ఈ ఉద్యమకారులు ఉద్యమం బాగా చేస్తారు. కానీ పరిపాలన చేతకాదు. మీరు కూడా అట్టర్‌ఫ్లాప్‌ అయితరు అనుకున్నాం. కానీ మీరు వేరే విధంగా రుజువు చేసుకున్నరు. చాలా సంతోషంగా ఉంది’ అన్నరు. అదే మాట అరుణ్‌జైట్లీ చెప్పారు. చిల్లర పంచాయితీలు చేయకుండా, తదేక దీక్షతో ఏ వర్గం ప్రజలు ఎట్ల? ఎవరి సంక్షేమం ఎట్ల? మంచి చెడ్డలు ఎట్ల? ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడటం ఎట్ల? సంపద పెంచడం ఎట్ల? పెంచిన సంపదను పేదలకు పంచడం ఎట్ల? అనే దానిలో మేం తలమునకలై ఉన్నాం.

ప్రజల్లో అమాయకులు లేరు
తెలంగాణ లైన్‌లో పడ్డది. ఈ లైన్‌ ప్రజలు పోగొట్టుకోరు. ప్రజల్లో అంత అమాయకులు లేరు ఎవ్వరు. వాళ్లకు కామన్‌ సెన్స్‌ ఎక్కువ. ఉట్టిగనే గుర్తు పడుతరు. అట్ల ప్రజలే కాపాడుకుంటరు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంటది. ఈ రోజు మిత్రులు పెద్దిరెడ్డి, స్వర్గం రవి వాళ్ల అనుచరులతో పెద్ద ఎత్తున కదిలిరావడం, ఈ ప్రగతి ప్రస్థానంలో మేం కూడా భాగస్వాములం అవుతాం.. మీతోపాటు భుజం కలుపుతమని మనతోని చేరారు. నేను వారికి, వాళ్ల బృందానికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్న.

పార్టీలో చేరిన వారు
టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రముఖ నేతల్లో హుజూరాబాద్‌ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ కిషన్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిన స్వప్న, గౌడ సంఘం అధ్యక్షుడు వంగాల హనుమంతుగౌడ్‌, జమ్మికుంట మాజీ ఎంపీపీ రామస్వామి, మాజీ జడ్పీటీసీలు జీ సమ్మయ్య, నవాబ్‌పాషా, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొలసాని రామారావు, సైదాపూర్‌ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనందం, మాజీ సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి గణేశ్‌, సీడ్‌ అసోసియేషన్‌ మాజీ జిల్లా కార్యదర్శి తిరుపతిరావు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ డైరెక్టర్‌ రాజమల్లారెడ్డి, ఆల్‌ ఇండియా పద్మశాలి అసోసియేషన్‌ చైర్మన్‌ గంగాధర్‌ తిలక్‌, ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి రాజా ఉమ్మారెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మాజీ మంత్రులు రెడ్యానాయక్‌, ఎల్‌ రమణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి పాల్గొన్నారు.

తల్లిని, తండ్రిని కొనుక్కుంటమా!
ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్న. తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవ్‌. అతి తక్కువగా ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని నిన్న పార్లమెంట్‌లో మంత్రి చెప్పిండు. మూలకుపడ్డ ముసలోళ్లు కూడా దర్జాగా ఉన్నరు తెలంగాణలో. నేను నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాంతానికి పోతే.. ఐదారుగురు అమ్మలు వచ్చి.. ‘బిడ్డా మా కొడుకులు నౌకరి చేస్తరు. వాళ్లు మమ్ములను చూస్తలేరు. మాకు కూడా పింఛన్‌ ఇవ్వు’ అని అడిగిన్రు. నేను ఆ గవర్నమెంట్‌ ఉద్యోగస్థులను పిలుచుకొని.. ‘మంచి జీతాలు ఇస్తాన్నం కద.. రెండువేలు మీ తల్లిదండ్రులకు గవర్నమెంట్‌ ఇచ్చే పింఛన్‌ మందం ఇస్తే ఏం పోయే. నువ్వు కూడా ముసలోనివి అయితవ్‌ కదా’ అని చెప్పిన. సొంత అవ్వయ్యకు బుక్కెడు బువ్వ పెట్టనోడు దేశానికి సేవ చేస్తా అంటే నమ్మాలా? ఏదైనా కొనుక్కోవచ్చు ప్రపంచంలో తల్లిని.. తండ్రిని కొనుక్కుంటమా! పోతే మళ్ల దొరుకతరా! ఉన్నప్పుడే వాళ్లను గౌరవంగా పొట్టలపెట్టుకొని సాదుకోవాలె.

అన్నీ మీ ముందే ఉన్నాయి
రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామంటే మాజీ మంత్రి జానారెడ్డి అసెంబ్లీలో సవాల్‌ చేసిండు. 24 గంటల కరెంట్‌ ఇస్తే గులాబీ కండువా కప్పుకొని నీకే ప్రచారం చేస్తా అన్నడు. మాట తప్పి మొన్న నాగార్జునసాగర్‌లో పోటీ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతం అంటే.. ఆ అయితదా.. రైతుబంధు అంటే అయితదా.. అన్నరు. అన్నీ అయితున్నయ్‌. నేను చెప్పే కార్యక్రమాలన్నీ ఎక్కడనో అమెరికాలో, ఢిల్లీలో జరిగేటివి కాదు. మీ గ్రామాల్లో, మీ బస్తీల్లో, మీ పట్టణాల్లో ప్రత్యక్ష అనుభవంలో ఉన్నయ్‌. అందుకే జనంలోకి పోతే మాకు ఆదరణ దొరుకుతున్నది. దీన్ని జీర్ణించుకోలేక అసహనంతో.. దేవుడు నోరు ఇచ్చిండు కదా అని అడ్డంపొడుగు మాట్లాడుతున్నరు. ఏనుగు పోతుంటే కొన్ని చిన్నచిన్న జంతువులన్నీ పిచ్చిపిచ్చి కతలు చేస్తా ఉంటయ్‌. ఏనుగు పట్టించుకుంటదా! తన దారి తను పోతది. మేం కూడా అట్లనే అనుకొని ప్రయాణం చేస్తున్నాం. కలగన్న తెలంగాణ ఆవిష్కరణ చేద్దాం. అద్భుతంగా ముందుకు సాగుదాం.

దళితబంధు ఏడాదిన్నర క్రితమే రావాల్సింది
సమాజంలో చాలా వెనుకబడి, దోపిడీకి, వివక్షకు గురైన జాతి దళిత జాతి. ఏదో ఒకటి చేసి వాళ్లను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యేలతో జరిగిన ప్రతి మీటింగ్‌లో చెప్తూ వస్తున్న. దళితుల కోసం గత బడ్జెట్‌లోనే నిధులు కేటాయించినం. వాస్తవానికి ఈ పథకం ఏడాదిన్నర కిందటే మొదలు కావాలే. కానీ కరోనా వచ్చి ఆలస్యమైంది. దళితులకు తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీలు లేవు. విద్య కూడా ఈ మధ్యే కొంచెం మంచిగ అందుతున్నది. కాళ్లు చేతులు మాత్రమే ఆస్తిగా ఉన్న లక్షల దళిత కుటుంబాలు ఉన్నయి. వాళ్లు పైకి రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. సంపద పెంపులో భాగంగా వచ్చిందే మన దళితబంధు. ఈ పథకం మహాయజ్ఞం.

కంటి వెలుగు ఆలోచన ఎవరికీ రాలేదు
కంటి వెలుగు అని ఒక ప్రోగాం పెట్టిన. ఎవ్వరు ఆలోచించలే దేశంలో. అది కూడా నన్ను ఎవరూ అడగలే. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటే అక్కడ విచిత్రమైన కత బయటపడ్డది. అక్కడ పిల్లలను ఇటు సార్లు, అటు అవ్వయ్య కొడుతాండ్లు. అసలు సంగతి ఏందంటే.. మనిషి ఉషారే ఉన్నడు కానీ చూపు బాగలేదు. ఊళ్లో పరీక్షలు చేస్తే చిన్నచిన్న పోరగాళ్లు 27 మంది ఎల్లిండ్రు. మన రాష్ట్రంలో ఈ ఆప్తమాలజీ డిపార్ట్‌మెంట్‌ ఏం పని చేస్తున్నది? అని మొత్తం లైన్‌ పట్టిన. కంటి వెలుగు అని పేరు పెట్టి ప్రజలందరినీ పరీక్షించి నలభై, యాభై లక్షల మందికి అద్దాలు సప్లయ్‌ చేసినం. ఇంట్ల ముసలివాళ్లకు కండ్లు మస్క అయితయ్‌. వాళ్లు బయటికి ఎటన్న పోతే కండ్లు కనపడక ఏదన్న తట్టుకొని పడుతరు. నడుము ఇరిగిపోతది. లేని బాధలు వస్తయ్‌. కాబట్టి అద్దాలు వాళ్లకే ఇప్పియాలే ముందు అని చెప్పిన. ఈ మాట విని ఉన్న ఏడెనిమిది మంది ముసలోళ్లు ఒక్కబరే కండ్లళ్ల నీళ్లు తీసుకొని ఏడ్చారని నా మిత్రుడు పల్లా రాజశ్వేర్‌రెడ్డి చెప్పిండు. ‘ఇక్కడ నా కొడుకు చూస్తలేడు కానీ కేసీఆర్‌ చెపుతాండు. నిజం ముచ్చటనే ఆయన చెప్పింది. ఆయన కడుపు సల్లగుండ’ అన్నరట. కన్‌సర్న్‌ అనేది మనం వాళ్ల బాధలోకి పోయి, ఆ బాధ మనకే గురైనట్లు ఫీలైనప్పుడు నీకు కరెక్ట్‌ ఆలోచన వస్తది. ఏదైనా చేయాలే అనిపిస్తది. గవర్నమెంట్‌ అంటే ఇట్ల ఉండాలె. ఏది ఎవరికి అక్కెర ఉన్నదో వాళ్లకు సాయం చేసే పరిస్థితి ఉండాలె. చిల్లర వాదనలకు అతీతంగా అన్ని వర్గాలను బాగు చేసుకుంటూ మన ప్రస్థానం కొనసాగుతున్నది. ఈ ప్రస్థానం ఇట్లనే కొనసాగుతది. నాకు డౌట్‌ లేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana