ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 04:22:00

పులిరాజాకు కరోనా వస్తుందా

పులిరాజాకు కరోనా వస్తుందా

 • కొంపముంచుతున్న నాకేమవుతుందనే ధీమా
 • చాపకింద నీరులా మహమ్మారి వైరస్‌ వ్యాప్తి
 • విందులు, వినోదాలతో కరోనా కలకలం
 • అంత్యక్రియల్లోనూ అంటుతున్న మహమ్మారి
 • తాజాగా పాజిటివ్‌ కేసుల్లోని సత్యాలివి
 • భౌతికదూరం, మాస్క్‌ ధరించడమే రక్ష
 • లాక్‌డౌన్‌ స్ఫూర్తిని చాటాలంటున్న నిపుణులు
కరోనా.. మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది! మీరు ఎక్కడెక్కడ నిర్లక్ష్యంగా తిరుగుతున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది! ఆదమరిచి ఉన్నారా.. మీకు లియకుండానే మిమ్మల్ని ఆవహించి.. మీ ఇంటిని ఆక్రమించి.. మీకు అయినవాళ్లని, మీ చుట్టూ ఉన్నవారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది! వారిలో ఎవరైనా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లయితే.. వారి ఆయువునూ హరిస్తుంది! 
మీ తిరుగుడు.. మీ చుట్టూ ఉన్నవారికి ముప్పు తెస్తుంది! సమాజంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్‌ చేస్తున్న హెచ్చరికలు ఇవి! ఈ విశ్వమారి నుంచి తప్పించుకునే మార్గం ఒక్కటే! నిత్యం అప్రమత్తత! మీరు పాటించే జాగ్రత్తలు అనేకమందికి రక్షణ కవచాలు! వైరస్‌ బయటపడిన రోజు నుంచి నిపుణులు, వైద్యులు గొంతు చించుకుంటున్నది ఇదే!
పులిలాంటోడిని.. కరోనా వైరస్‌ నన్నేం చేస్తుందని బీరాలు పలుకుతున్నారా?చేతులు శుభ్రం చేసుకోకపోయినా.. వైరస్‌ నా దరిచేరే సమస్యే లేదని మీసాలు మెలేస్తున్నారా?

తస్మాత్‌ జాగ్రత్త!

మాస్కులేకుండా దూసుకుపోయి.. భద్రంగా వచ్చేయగలననే అతి విశ్వాసంతో ఉన్నారా?మందిలోకి చొరబడినా.. పొలిమేరలు దాటిపోయినా మీ తిరుగులేని ఆరోగ్యం మిమ్మల్ని కాపాడితీరుతుందని నమ్మకంగా ఉన్నారా?

ఇదీ బాధ్యతంటే!

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలో ఓ యువకుడు ఉన్నతోద్యోగానికి సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కరోనా వ్యాప్తితో నానా తిప్పలుపడి మూడువారాల క్రితమే స్వస్థలానికి చేరుకున్నారు. తాను కరోనా భయంకరంగా ప్రబలి ఉన్న ప్రదేశానికి వెళ్లి వచ్చానన్న వాస్తవాన్ని గుర్తించిన యువకుడు.. నాటి నుంచి హోంక్వారంటైన్‌లోనే ఉన్నారు. తీరా 17 రోజులకు అతడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చాక స్వీయ నియంత్రణ పాటించడంతో అతని నుంచి మరెవరికీ వైరస్‌ సోకలేదు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనాకు చిన్నా, పెద్ద, బీద, గొప్ప అనే తేడాలేదు. మనుషులైతే చాలు అందరినీ సమదృష్టితో చూస్తున్నదనేది జగమెరిగిన సత్యం. కానీ.. నాకెందుకు కరోనా సోకుతుందన్న కొందరి నిర్లక్ష్యం తనతోపాటు తోటివారి కొంపముంచుతున్నది. అనాలోచిత చర్యే వైరస్‌ రూపంలో వారి కుటుంబాన్ని అలుముకుంటున్నది. వారి బాధ్యతలేని విచ్చలవిడితనం ఎందరో ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నది. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా విందులు, వినోదాలు అంటూ గుంపులు గుంపులుగా తిరుగుతూ వైరస్‌ను కొనితెచ్చుకొంటూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకొంటున్నారు. ఇదే తరహాలో వైరస్‌తో తిరుగుతున్నవారు ఇతరులకు అంటించి.. వారిని, వారి చుట్టుపక్కలవారిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఇటీవల కొన్ని కేసులను  
గమనిస్తే.. వారి నిర్ల్యక్ష్యం, అమాయకత్వం, బాధ్యతారాహిత్యం ఇతరుల కొంప ముంచుతున్నదని తేటతెల్లమవుతున్నది. 
 • సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రాగా, ఏప్రిల్‌ 3న అతనికి కరోనా నిర్ధారణ అయ్యింది. అప్పటికే కరీంనగర్‌లో వెలుగుచూసిన తబ్లిగీ ఉదంతంతో దేశమంతా అప్రమత్తమైనప్పటికీ సదరు వ్యక్తి నిర్లక్ష్యం వల్ల వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి.. 81 మందికి సోకింది! జిల్లా అల్లకల్లోలమైంది! 
 • హైదరాబాద్‌ మంగళ్‌హాట్‌కు చెందిన ఓ వ్యక్తి జియాగూడలో బంధువు అంత్యక్రియల్లో పాల్గొనగా అతనికి కరోనా సోకింది. ఒక సామూహిక కార్యక్రమానికి వెళ్లానన్న సోయి లేకపోవడంతో.. ఆయనకు అంటిన వైరస్‌.. ఆయన ఉండే భవనంలోని మరో 25 మందికి తగులుకున్నది! 
 • హైదరాబాద్‌ కుర్మగూడ డివిజన్‌ మాదన్నపేట మైదిపురా కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో నివసించే వ్యక్తి కుమార్తె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించగా, అపార్టుమెంట్‌వాసులంతా హాజరయ్యారు. వారిలో ఎవరికి వైరస్‌ ఉన్నదోకానీ.. ఆయనకు అంటుకున్నది. అంతేకాదు.. ఆయన కుమార్తెకు, ఆ అపార్ట్‌మెంట్‌లోని మరో 23 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. 
 • ధూల్‌పేట ప్రాంతానికి చెందిన ఓ బ్యాంక్‌ ఉద్యోగి తన స్నేహితులను కలిసేందుకు తరచుగా జియాగూడకు వెళ్లివస్తుండేవాడు. అక్కడ కేసుల తీవ్రత ఎక్కువ ఉన్నదని వార్తలు వస్తున్నా.. ఎలాంటి భయంలేకుండా ఇంట్లో పూలుపండ్ల కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది వైరస్‌ బారినపడ్డారు. ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. 
 • నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఓ వ్యక్తికి మూడురోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ఊరికి వెళ్లి వచ్చానన్న స్పృహ కూడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లాలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు రెండురోజులపాటు వెళ్లారు. ఈ సమూహంలో ఒకరికి వైరస్‌ సోకడంతో ప్రైమరీ కాంటాక్ట్స్‌ ఆధారంగా చేపట్టిన పరీక్షల్లో ఒక్కొక్కరికీ పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్నది!
 • పై కేసుల్లో కరోనా సోకిన వ్యక్తుల పరివర్తన ఆలోచింపజేస్తున్నది. కొందరు ఇష్టం వచ్చినట్టు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతో తనతోపాటు కుటుంబసభ్యులకు, తోటి కుటుంబాలకు ముప్పు తెచ్చిపెట్టారు. స్వీయ నియంత్రణను బాధ్యతగా పాటించిన నిజామాబాద్‌ జిల్లా మోపాడ్‌ యువకుడు ఇతరులకు వైరస్‌ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. కరోనా విపత్తు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు చెప్తున్నా.. కొద్దిమంది పట్టించుకోకపోవడం విస్తుగొల్పుతున్నది. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ అమలులో చూపిన స్ఫూర్తినే సడలింపుల్లోనూ ప్రదర్శిస్తే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

స్వీయ నియంత్రణే మందు

కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినవారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు సులువుగా వైరస్‌ బారిన పడుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారే స్వీయ రక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. జన సంచార ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాలని హెచ్చరిస్తున్నారు. 60 ఏండ్లు పైబడినవారు, పిల్లలు బయటకు రాకుండా ఉంటే మంచిదని పేర్కొంటున్నారు. వ్యాధులతో బాధపడుతున్నవారు అత్యవసరమైతే తప్ప వీలున్నంతవరకు వ్యక్తిగత వైద్యనిపుణులను సంప్రదిస్తూ టెలి మెడిసిన్‌ పద్ధతిలో చికిత్సలు తీసుకోవడం మంచిది. ఆన్‌లైన్‌ పద్ధతుల్లోనూ వైద్యసేవలు అందుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఈ సమయంలో ముఖ్యమేనని వైద్యులు సూచిస్తున్నారు.


logo