శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 08:12:33

టీకా వేసుకున్నాక క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..

టీకా వేసుకున్నాక క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..

హైద‌రాబాద్ : కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, అయితే వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 139 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. టీకాల సామర్థ్యంపై అపోహలు వద్దని విజ్ఞప్తిచేశారు. మనం ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్లు వాడుతున్నామని, కొన్ని టీకాలు వేసిన తర్వాత రియాక్షన్లు కనిపిస్తాయని తెలిపారు. ఇది అత్యంత సాధారణమని చెప్పారు. కొందరికి టీకా వేసిన తర్వాత జ్వరం వస్తుందని గుర్తుచేశారు. దీనర్థం వ్యాక్సిన్‌కు శరీరం ప్రతిస్పందిస్తున్నదని, అంతేగానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కావని స్పష్టం చేశారు. జ్వరం, దురదలు, కండరాల నొప్పి వంటివి అత్యంత సాధారణమైన లక్షణాలని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయని, పారాసిటమల్‌ వంటివి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. రెండో డోస్‌ తర్వాత కాస్త ఎక్కువ రియాక్షన్లు ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

టీకా వేసుకున్న కొందరిలో కనిపించే లక్షణాలు  ఇవీ..

కొవిషీల్డ్‌ 

టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, అశాంతిగా అనిపించటం, జ్వరం, చలి, కీళ్ల నొప్పులు, కడుపులో వికారం.

కొవాగ్జిన్‌ 

టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కడుపులో వికారం. వాంతులు, చమట పట్టడం, జలుబు, దగ్గు, చికాకు, వణుకు.


VIDEOS

logo