శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 13, 2020 , 13:22:00

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది?: మంత్రి కేటీఆర్‌

కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏది?: మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌: కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, ఇది ప్రధాని మోదీ వైఫల్యంగా భావించాలా అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని వెల్లడించారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఐదు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకోగలిగామని అన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో దాదాపు వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, మాతా శిశు మరణాల రేటు తగ్గిందని చెప్పారు. కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు.


ప్రజలను భయపెట్టొద్దు

ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఇంకా నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాకు చికిత్స అందించేందుకు ప్రైవేటు దవాఖానలు భయపడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్యులు మాత్రం భయపడకుండా రోగులను చేర్చుకుంటున్నారని వెల్లడించారు. కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితుడి వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారని, ప్రాణాలకు తెగించి ప్రభుత్వ వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు. చిన్నచిన్న పొరపాట్లను పెద్దదిగా చూపించి ప్రజలను భయపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.కరోనాకు ధనిక, పేద తేడాల్లేవు..

కరోనా బాధితులను వెలివేసినట్లు చూడటం సరికాదన్నారు. కరోనాకు పేద, ధనిక అనే తేడాలు లేవని, ఎవరికైనా రావచ్చని పేర్కొన్నారు.  కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. రెండు శాతం మరణాలను చూపించి, 98 శాతం రికవరీలను చిన్నదిగా చూపొద్దని సూచించారు. భారత్‌లో తయారైన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఫార్మా పరిశ్రమపై ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని, అనవసర విమర్శలు చేసి వైద్య సిబ్బంది ైస్థెర్యాన్ని దెబ్బతీయోద్దని సూచించారు. పాలమూరు జిల్లాలో అతితక్కువ కాలంలోనే మార్పులు జరిగాయని చెప్పారు.


logo