శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 01:27:29

ఏది కరోనా? ఏది సీజనల్‌?

ఏది కరోనా? ఏది సీజనల్‌?

  • రోగమేదో తెలియక ప్రజల అవస్థలు
  • జ్వరం, తుమ్ము, దగ్గు వస్తే వెన్నులో వణుకు
  • లక్షణాల ఆధారంగా అంచనా వేయవచ్చు: నిపుణులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇది కరోనా కాలం.. వర్షాకాలం కూడానూ.. దగ్గినా, తుమ్మినా.. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా.. ‘వామ్మో! ఇది కరోనా కావచ్చు; సీజనల్‌ కదా అందుకే ఇలా కావచ్చు’ ప్రజలను ఆగం పట్టిస్తున్న అనుమానాలివీ. ఏది కరోనానో, ఏది సీజనల్‌ వ్యాధి అన్నది తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి దగ్గు వచ్చినా గుండెల్లో కరోనా దడ పుడుతున్నది. జ్వరం వస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఒంటి నొప్పులు, తలనొప్పి వస్తే భయం వెంటాడుతున్నది. ప్రస్తుతం వానకాలం కొనసాగుతున్నది. ఈ కాలంలో దోమల బెడద ఎక్కువే. వర్షాలతో సాధారణంగా సీజనల్‌ వ్యాధులు అంటే జలుబు, వైరల్‌ ఫీవర్‌, దగ్గు, డెంగీ తదితర వ్యాధులు ప్రబలడం సహజం. అయితే, కరోనా విజృంభిస్తున్న ఈ వేళ.. సీజనల్‌ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఈ రెండింటిని వేరు చేసి చూడటం అంత సులువు కాదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీజనల్‌గా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందని, అలాగని చిన్నపాటి జ్వరం, దగ్గును కరోనాగా భావించి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని ఫీవర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. కొన్ని లక్షణాలతో కరోనానా? సీజనలా? అన్నది తెలుసుకోవచ్చని వెల్లడించారు. లక్షణాలు ఏవైనా.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిస్తే కరోనా వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివాళ్లు పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్‌ శంకర్‌ సూచించారు. ఇండ్లలోనే ఉండేవాళ్లు తమకు ఉన్న లక్షణాలను క్షుణ్నంగా పరీక్షించుకోవాలని, సీజనల్‌ లేదా సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతుందని వెల్లడించారు. అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు.కరోనా లక్షణాలు
సీజనల్‌ లక్షణాలు
తీవ్ర జ్వరం
సాధారణ జ్వరం
మూడు రోజులైనా తగ్గదు
మూడు రోజుల్లో తగ్గుతుంది
జలుబు ఉన్నా ముక్కు కారదు
ముక్కు కారుతుంది
పొడి దగ్గు వస్తుంది
కఫంతో కూడిన దగ్గు వస్తుంది
రుచి, వాసన తెలియదు
రుచి, వాసన తెలుస్తుంది
ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటాయి
సాధారణంగా ఉంటాయి
తలనొప్పి తీవ్రంగా ఉంటుంది
సాధారణంగా ఉంటుంది
గొంతునొప్పి ఉంటుంది
గొంతునొప్పి ఉంటుంది
ఛాతిలో నొప్పి వస్తుంది
ఛాతి నొప్పి ఉండదు
కండ్లు ఎర్రబడతాయి
కండ్లు ఎర్రబడవు
వాంతులు, విరేచనాలు ఉంటాయి
వాంతులు, విరేచనాలు ఉంటాయిlogo