సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 20:27:05

#WhereIsAmitShah: అమిత్‌షా ఎక్కడ?

#WhereIsAmitShah:  అమిత్‌షా ఎక్కడ?

న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ సర్కార్‌ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన ఉద్ధృతమైంది.   అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో  వేలాది మంది రైతులు నిరసన చేస్తుండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లో షో చేయడానికి వెళ్లారని సోషల్‌ మీడియాలో    నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.   

WhereIsAmitShah అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. #WhereIsAmitShah అనే హ్యాష్‌ట్యాగ్‌తో లక్షల సంఖ్యలో ట్వీట్స్ వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ఈరోజు ట్విటర్లో టాప్ ట్రెండింగ్‌లో  కొనసాగడం గమనార్హం. 

రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు, హక్కుల కోసం ఢిల్లీకి వస్తుంటే అమిత్‌షా ఎక్కడికెళ్లారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల గోస పట్టకుండా.. జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో  ప్రచారానికి వెళ్లడం సిగ్గుచేటు అంటూ పలువురు నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.  ఇక్కడ రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి.. తాను మాత్రం హైదరాబాద్‌కు వెళ్లి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్నాడంటూ మండిపడ్డారు. 

శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను రాజధానిలో అడుగుపెట్టనీకుండా రాళ్లతో స్వాగతం పలికిన అమిత్‌షాకు..హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు పూలతో స్వాగతం పలుకుతున్నారని.. ఇదే రైతులపట్ల బీజేపీ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదంటూ పలువురు విమర్శించారు. రైతులు రోడ్డుపై బాధలుపడుతుంటే అమిత్‌షా రోడ్‌షోలో బిజీగా ఉంటారా? అంటూ ప్రశ్నించారు. కేంద్రహోంశాఖ మంత్రికి రైతుల సమస్యలకంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైనదా?  అని ధ్వజమెత్తారు.