శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 19:23:26

కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి?

కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి?

మ‌హ‌బూబాబాద్‌ : కేంద్రం ఇస్తాన‌న్న కోటి ఉద్యోగాలు ఏమ‌య్యాయ‌ని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీని ప్ర‌శ్నించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశం మహబూబాబాద్, మరిపెడ బంగ్లాలో వేర్వేరుగా జరిగాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గస్థాయి ప‌ట్ట‌భ‌ద్రులు భేటీకి హాజ‌ర‌య్యారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, ధర్మసోత్ రెడ్యా నాయక్ హాజ‌ర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలు నమ్మొద్ద‌న్నారు. కేంద్రం ఇస్తానన్న కోటి ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. మనం రాష్ట్రంలో చెప్పిన వాటికంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చుకున్న‌ట్లు తెలిపారు. 29 వేల కానిస్టేబుల్, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 30 వేలు, 33 వేల విద్యుత్ ఉద్యోగాలు, 14 వేల గురుకుల పోస్టులు, 7500 ఆర్టీసీలో, 20 వేలు సింగరేణి, పంచాయతీ కార్యదర్శులు, ఇతరత్రా ఐదున్నర లక్షల ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు. ఒక నిర్ణీత పద్ధతిలోనే ఉద్యోగాలు వస్తాయ‌న్నారు. జీవో 16 ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఎం కేసిఆర్ సంకల్పస్తే అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అన్నారు. మ‌రోవైపు ప్రైవేటు రంగంలో, ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగిన‌ట్లు తెలిపారు. దేశంలో 33 కంపెనీలను మూసిన ఘనత బీజేపీది అన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, ఉచిత విద్యుత్, పెన్షన్లు ఎవరిస్తున్నారు. ప్రభుత్వం మీద విశ్వాసాన్ని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నిరూపించాల‌ని పేర్కొన్నారు.

డీఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు త‌మ‌దేన్నారు. బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామ‌న్నారు. అందుకు మనమంతా ప్రతిన పూనుదామ‌న్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. త‌న‌ నియోజకవర్గ పట్టభద్రులమంతా టీఆర్ఎస్‌ గెలుపుకు కట్టుబడి ఉన్నామ‌న్నారు. ఈ సమావేశాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, బస్వరాజు సారయ్య, గుడిపూడి  నవీన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర , జిల్లా నాయకులు, స్థానిక‌ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఇన్‌ఛార్జీలు, పట్టభద్రులు పాల్గొన్నారు.