అమిత్‌షా ఎక్కడ?

- రైతులంతా ఢిల్లీ వస్తే ఆయన హైదరాబాద్ పారిపోయాడు
- అన్నదాతలు రోడ్లపై ఉంటే హోంమంత్రి రోడ్‌షోలా?
- రైతులకేమో రాళ్ల దాడులు.. అమిత్‌షాకు పూల దండలా?
- కేంద్ర హోంమంత్రిపై నెటిజన్ల మండిపాటు
- సోషల్‌మీడియాలో ‘వేర్ ఈజ్ అమిత్‌షా’ అంటూ ట్రోలింగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణఃకేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దేశవ్యాప్తంగా నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కోట్ల మంది రైతులు న్యాయమైన డిమాండ్ల సాధనకు ఢిల్లీని ముట్టడించటంతో అమిత్ షా హైదరాబాద్ పారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. ట్విట్టర్లో ‘వేర్ ఈజ్ అమిత్ షా’ హ్యాష్ ట్యాగ్‌తో ఏకి పారేస్తున్నారు. రైతులు ఉత్త కాళ్లతో, కట్టుబట్టలతో రోడ్లపై ఉంటే హోంమంత్రి హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తాడా? అంటూ మండిపడుతున్నారు.
ఎన్నికలే ముఖ్యమా?
తమ బాధలు వెళ్లబోసుకొనేందుకు రైతులు ఢిల్లీకి వస్తే కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొని, రోడ్లు తవ్వేసి, బాష్పవాయువులు, వాటర్ క్యానన్లతో దారుణంగా హింసించటం.. అదే సమయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి కేంద్ర హోంమంత్రి రావటంపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. రైతులు ఢిల్లీ చేరుకోకుండా నిలువరించేందుకు రాళ్లదాడులు చేయిస్తూ.. హైదరాబాద్‌లో బీజేపీ నేతలతో పూలదండల స్వాగతాలు అందుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. బీజేపీకి ప్రజల కష్టాలు పట్టవా? ఎన్నికలే ముఖ్యమా? అని మండిపడుతున్నారు. రైతులను కలిసేందుకు కూడా సమయం లేని అమిత్ షా.. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్లాడని నిలదీస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కోట్ల మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా 130 కోట్లమందికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లటం ఏమిటని నిలదీస్తున్నారు. రైతులు రోడ్లపై ఉంటే.. హోంమంత్రి రోడ్ షోలతో బిజీగా ఉన్నాడని సిద్ధార్ద సేథియా అనే నెటిజన్ మండిపడ్డారు. రైతులు తమ డిమాండ్లు చెప్పుకొనేందుకు ఢిల్లీ వస్తే అమిత్ షా హైదరాబాద్ పారిపోయాడని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. అమిత్ షా చేతిలోని భద్రతా బలగాలు రైతులపై లాఠీచార్జీ చేస్తుంటే.. ఆయన మాత్రం ఢిల్లీని విడిచిపోయారని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వేల మంది స్పందిస్తుండటంతో ‘వేర్ ఈజ్ అమిత్ షా’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
బీజేపీని బహిష్కరిద్దాం
కేంద్ర ప్రభుత్వ దమన నీతి వల్ల దేశానికి అన్నంపెట్టే రైతన్న అష్టకష్టాలు పడుతుండటంతో.. వారి బాధలు తీర్చేందుకు అందరూ ముందుకు రావాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. బీజేపీకి ప్రజలకంటే ఎన్నికల్లో గెలువటమే ముఖ్యమని, దేశ ప్రజల గోస వారికి పట్టదని మండిపడుతున్నారు. బీజేపీని బహిష్కరిద్దామంటూ నినదిస్తున్నారు. తన రోడ్ షోకు ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారని ఫొటోలు షేర్ చేస్తున్న హోంమంత్రి.. కరోనాను అడ్డుకొనేందుకు భౌతికదూరం పాటించవద్దని చెప్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఓహో.. హోంమంత్రి హైదరాబాద్‌లో కరోనాను వ్యాప్తిచేసే పనిలో ఉన్నారా?’ అని జోకులు వేస్తున్నారు.
అమిత్‌షా పర్యటనలో నిరసనల సెగ
- సేవ్ బీఎస్ఎన్ఎల్.. వియ్ వాంట్ 4జీ
- ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆగ్రహం
- అర్ధంతరంగా ముగిసిన రోడ్‌షో
హైదరాబాద్; నమస్తేతెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చేదు అనుభవం ఎదురైంది. సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సేవ్ బీఎస్ఎన్ఎల్, వియ్ వాంట్ 4జీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలుచేశారు. దీంతో అమిత్‌షా రోడ్‌షోను అర్ధంతరంగా ముగించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం.. పీఎస్‌యూలను అమ్మాలని చూస్తున్నదని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అడుగగా.. అలాంటిదేమీ లేదని అన్నారు. అంతలోనే అతడిని టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి వచ్చావా అంటూ అసహనం వ్యక్తంచేశారు.
భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు
అంతకుముందు ఢిల్లీనుంచి ఎన్నికల ప్రచారం కోసం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షా.. నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అమిత్‌షా భాగ్యలక్ష్మి ఆలయా న్ని సందర్శించడం వెనుక మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యమని పలువురు అభిప్రాయపడ్డారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు పాతబస్తీలో పెద్దఎత్తున తలదాచుకొంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఎంఐఎం నేత ఒవైసీ పేరు చెప్పి దాటవేశారు. హైదరాబాద్ ఐటీఐఆర్‌ను ఓవైపు రద్దు చేసింది.. తమ ప్రభుత్వమే అయినప్పటికీ.. నగరాన్ని ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామంటూ అమిత్‌షా చెప్పడంపై ఆయావర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
తాజావార్తలు
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్‌బాల్ పోటీల కసరత్తు