మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:55:21

ప్రపంచ వేదికపై పాక్‌ను ఒంటరి చేశారు

ప్రపంచ వేదికపై పాక్‌ను ఒంటరి చేశారు

చరిత్రను మార్చాలన్న పట్టుదల లేదు కానీ, కాలాన్ని బట్టి చరిత్రను తిప్పగల సమర్థుడు. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలన్న స్వభావం కాదు కానీ, మౌనంగానే పనికానిచ్చేసేంత ధైర్యవంతుడు. నిశ్శబ్ద మేధావి ఆయన.. రాజకీయ చదరంగంలో చాణక్యుడు ఆయన.. ఇలా పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎంత సైలెంట్‌గా ఉంటారో, తీసుకునే నిర్ణయాలు అంత సంచలనం రేపుతాయి. అందులో చెప్పుకోదగ్గది.. కశ్మీర్‌ అంశం. ఈ అంశంపై చర్చించేందుకు సొంత పార్టీ నాయకులను కాదని, ప్రతిపక్ష నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపి దేశవ్యాప్తంగా చర్చను లేపారు. కశ్మీర్‌కు స్వాతంత్య్రం అంటూ పాకిస్థాన్‌ ఎగిరెగిరి పడుతుంటే కూర్చున్న చోటు నుంచే ఆ దేశాన్ని ఒంటరి చేశారు. మాటలతో మనోభావాలను టచ్‌ చేయకుండానే తనదైన శైలిని ప్రదర్శిస్తూ ప్రపంచ వేదికపై పాక్‌ చెంప చెళ్లుమనిపించారు.1990ల్లో ఆజాద్‌ కశ్మీర్‌ అంటూ పాకిస్థాన్‌ గగ్గోలు పెట్టింది. అప్పటి ఆ దేశ ప్రధాని బెనజీర్‌ భుట్టో బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు పలికారు. 1990 ఫిబ్రవరి 4న ఆ దేశ రాజకీయనాయకులను సమావేశపరిచి, ఫిబ్రవరి 5న కశ్మీర్‌ సంఘీభావ దినంగా కూడా ప్రకటించారు.

తర్వాత ఐదు రోజులకే భారత్‌లో జమ్ముకశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పాకిస్థాన్‌ పార్లమెంటులో తీర్మానాన్ని ఆమె ఆమోదింపజేశారు. అయితే, ప్రధాని పదవి చేపట్టిన మొదట్లో దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టిన పీవీ.. కశ్మీర్‌ సమస్య తుట్టెను కదిపితే మొదటికే మోసం వస్తుందని గ్రహించారు. ఆ సమస్యపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. సరైన సమయం కోసం వేచి చూసిన ఆయన 1994 ఫిబ్రవరి 22న జమ్ముకశ్మీర్‌ భారత భూభాగమేనన్న తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో ఆందోళన చెందిన పాక్‌.. ఇస్లామిక్‌ దేశాల మద్దతుతో అదే నెల 27న ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడే పీవీ తన రాజకీయ చాతుర్యాన్ని బయటపెట్టారు. జెనీవాకు వెళ్లేందుకు అత్యంత జాగ్రత్తతో ఒక బృందాన్ని రెడీ చేశారు.

ముస్లిం నేతలు సల్మాన్‌ ఖుర్షీద్‌, ఈ.అహ్మద్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, హమీద్‌ అన్సారీ, ఐక్యరాజ్యసమితిలో కీలక హోదాలో పనిచేసిన తన ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు ప్రతిపక్ష నేత వాజ్‌పేయితో బృందాన్ని పంపారు. ఆ బృందానికి వాజ్‌పేయి నేతృత్వం వహించారు. అలా పక్కాగా ప్రణాళికను సిద్ధం చేశారు. తెర వెనుక కూడా పావులు కదిపారు. అప్పటి విదేశాంగ మంత్రి దినేశ్‌సింగ్‌ను ఇరాన్‌కు పంపారు.

ఆ దేశాధ్యక్షుడితో, అక్కడే ఉన్న చైనా విదేశాంగమంత్రితోనూ దినేశ్‌సింగ్‌ మంతనాలు జరిపారు. ఈ విషయం తెలియని పాక్‌.. కశ్మీర్‌ తీర్మానం నెగ్గుతుందని భావించింది. కానీ, సరిగ్గా తీర్మానంపై చర్చించే రోజు ఇండోనేషియా, లిబియా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. తీర్మానాన్ని మరోసారి పరిశీలించాలని చెప్పి సిరియా తప్పించుకుంది. చైనా, ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పాక్‌ తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తెర ముందు నుంచి, తెర వెనుక నుంచి పీవీ నడిపించిన తీరు ఆయన రాజకీయ చాతుర్యానికి అద్దం పడుతుంది. అందుకే ఆయన మోడ్రన్‌ చాణక్యుడు.

- సెంట్రల్‌ డెస్క్‌logo