బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 08:50:23

ఇంట్లో పెద్దవాళ్లు.. బయటికి వెళ్లొస్తే ఏం చేయాలి?

ఇంట్లో పెద్దవాళ్లు.. బయటికి వెళ్లొస్తే ఏం చేయాలి?

నాకు 26 ఏళ్లు. లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ వృత్తిరీత్యా తప్పనిసరిగా రోజూ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. నా తల్లిదండ్రులు పెద్దవాళ్లు. 65 ఏళ్ల అమ్మకు మధుమేహ వ్యాధి కూడా ఉంది. నాన్నకు 70 ఏళ్లు. బీపీ పేషెంటు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

-వివేక్, కరీంనగర్.

అత్యవసర సర్వీసుల్లో భాగంగా మీరు బయటికి వెళ్లక తప్పదంటున్నారు. అయితే ప్రతిరోజూ మాత్రమే కాదు... ఏ కూరగాయలు తెచ్చుకోవడానికో కొద్దిసేపటి కోసం అయినా సరే.. ఏ కారణం వల్ల బయటికి వెళ్లినా రాగానే కాళ్లూ, చేతులు శుభ్రం చేసుకోకుండా ఇంటి లోపలికి రావొద్దు. గేటు బయటే సబ్బుతో కాళ్లూ, చేతులు కడుక్కుని ముందుగా వాష్‌ రూమ్‌లోకే వెళ్లాలి. మీ బట్టలు, చెప్పులు కూడా శుభ్రం చేయాలి.  మీరు వేసుకున్న బట్టలన్నీ తీసి బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణం గానీ, డిటర్జెంట్‌ వాటర్‌లో గానీ ఆ దుస్తులను వేసేయాలి. మీ ఒంటి మీదో, జుట్టు మీదో  వైరస్‌ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తలస్నానం చేయాలి. అప్పుడే బయటికి రావాలి. 

అయితే,  మీ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వాళ్లకు సోకే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి పెద్దవాళ్లకు దూరంగా ఉండాలి. వాళ్లను ముట్టుకోవడం, హత్తుకోవడం చేయొద్దు. సాధ్యమైతే వేరే గదిలో ఉండటం మేలు. ఒకే హాల్‌లో ఉండాల్సి వచ్చినా వాళ్లకు కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండి మాట్లాడాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. సాధారణంగా కొవిడ్‌ 19 లక్షణాలు కనిపించడానికి 2 నుంచి 14 రోజులు పడుతుంది. ఎక్కువ మందిలో 5 నుంచి 7 రోజుల్లో బయటపడుతుంది. 14 రోజులు దాటిన తర్వాత లక్షణాలు లేకుంటే ఇక రాదనే అనుకోవాలి. అయితే మీలాగా యువకులైనవాళ్లలో చాలాసార్లు ఎటువంటి లక్షణాలూ లేకుండా కూడా వైరస్‌కి క్యారియర్లుగా ఉంటారు. అంటే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మీ శరీరంలోకి వచ్చిందీ, వెళ్లిందీ మీకే తెలియకపోవచ్చు. వ్యాధినిరోధక శక్తి  బలంగా ఉన్నవాళ్లలో ఇన్‌ఫెక్షన్‌ రావడం, దానితో వ్యాధినిరోధక కణాలు పోరాడి దాన్ని పారదోలడం... అన్నీ ఎటువంటి లక్షణాలు లేకుండానే జరిగిపోవచ్చు. ఈ సమయంలో వృద్ధుల దగ్గరికి వెళ్తే అసలే ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి వాళ్లు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది. 

ఇటలీలో అంత వేగంగా వ్యాధి వ్యాపించడానికి కారణం ఇదే. ఏ లక్షణాలు లేని యువకులు బయటికి వెళ్లి పార్టీలు చేసుకోవడంతో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పరిణమించింది. అందుకే ముఖ్యంగా యువతీయువకులు ఇల్లు కదలకండి. తప్పనిసరై బయటికి వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు పాటించండి. మీ గదిలో మీరు సెపరేట్‌గా ఉండండి. 


డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌

హైదరాబాద్‌


logo