శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 01:28:17

తేలికగానే నీట్‌

తేలికగానే నీట్‌

  • అన్ని సబ్జెక్టులూ సరళమే
  • పరీక్షకు 90% మంది హాజరు
  • మూడు వారాల్లో ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా     ఉద్ధృతంగా     ఉన్నప్పటికీ నీట్‌ పరీక్షకు విద్యార్థులు భారీగా హాజర య్యారు. 15.97లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా దాదాపు 90శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన రాష్ర్టాల సీఎంలకు, ఎన్టీఏకు ఆయన ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడి అనేక వివాదాల మధ్య నిర్వహించిన ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశం ఉన్నది. తుది ఫలితాలు మూడు వారాల్లో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది.  తెలంగాణ నుంచి ఈసారి 55 వేల మంది నీట్‌ రాశారు.

అన్ని సబ్జెక్టులూ తేలికే

గతంతో పోల్చుకుంటే ఈసారి పరీక్ష పేపర్‌ చాలా తేలికగా ఉన్నదని విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. ఎప్పుడూ కఠినంగా ఉండే భౌతికశాస్త్ర విభాగమే ఈసారి తేలికగా ఉన్నదని చెప్పారు. కటాఫ్‌ జనరల్‌ విద్యార్థులకు 50 పర్సంటైల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 40 పర్సంటైల్‌ ఉండవచ్చని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 80,055 ఎంబీబీఎస్‌, 26,949 బీడీఎస్‌, 52,720 ఆయుష్‌, 525 బీబీఎస్సీ-ఏహెచ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.  నీట్‌ పరీక్షలో కరోనా నియమాలను కఠినంగా అమలు చేశారు. ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. పరీక్ష హాల్లో విద్యార్థులు మాస్కులు తీయకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చి ఆదివారం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు త్వరలోనే ప్రత్యేకంగా నీట్‌ నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. 


logo