మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 01:34:29

ఇప్పుడే పిల్లలొద్దు!

ఇప్పుడే పిల్లలొద్దు!

  • 81.90% మంది అభిప్రాయం ఇదే.. 
  • ఆర్థిక, ఆరోగ్య చిక్కులొస్తాయని జంకు
  • దంపతుల కలలను చిదిమేస్తున్న కరోనా
  •  తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
  • సైకోసొమాటిక్‌ గైనకాలజీ జర్నల్‌ వెల్లడి

వరంగల్‌కు చెందిన సందీప్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో సేల్స్‌మెన్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెండ్లయింది. కరోనా కారణంగా దుకాణంలో సగంమందితోనే పనిచేయిస్తున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో పోతుందో తెలియని దుస్థితి. ఈ పరిస్థితుల్లో పిల్లలను కంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయనే ఆందోళనతో తన భార్య గర్భాన్ని తీయించాడు.

మే నెలలో పెండ్లయిన మధు హైదరాబాద్‌ చింతల్‌లో ఉంటున్నాడు. కరోనా సమయంలో సంతానం కలిగితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయేమోననే భయంతో పిల్లలు కాకుండా జాగ్రత్తపడుతున్నాడు. వీరిద్దరే కాదు.. పిల్లల కనాలన్న ఇంకా ఎంతోమంది అమ్మానాన్నల ఆలోచనలపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుదీర్ఘ లాక్‌డౌన్‌ అవాంఛిత గర్భధారణకు దారితీస్తున్నదని గతంలో పలు అధ్యయనాల నివేదికలు ప్రచురించాయి. తాజాగా జర్నల్‌ ఆఫ్‌ సైకోసొమాటిక్‌ గైనకాలజీ నిర్వహించిన అధ్యయనం ఇందుకు భి న్నంగా ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అధ్యయనంలో పాల్గొన్న 81.90% మంది.. ప్రస్తుత సంక్షోభ సమయంలో పిల్లలను కనాలనే ఉద్దేశం తమకులేదని తేల్చిచెప్పారు. కరోనా వెలుగు చూడకముందే గర్భధారణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నవారిలో 78% మంది ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వీరిలో చాలామంది మరో ఏడాది వరకు గర్భధారణకు దూరంగా ఉంటామని స్పష్టంచేశారు. 

కలయిక ముద్దు.. పిల్లలు వద్దు

కరోనా మహమ్మారి అనేక జంటల్లో మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్టు జర్నల్‌ ఆఫ్‌ సైకోసొమాటిక్‌ గైనకాలజీ అధ్యయనం వెల్లడించింది. దీనినుంచి బయటపడగలమనే భరోసా చాలామందికి లేదట. దీని ప్రభావమే పిల్లలను కనాలన్న ఆకాంక్షను సైతం చిదిమేస్తున్నట్టు తేలింది. 30 ఏండ్లు పైబడ్డాక గర్భధారణ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. కానీ.. పిల్లలు వద్దనుకునేవారిపై అవి ఎలాంటి ప్రభావం చూపడంలేదు. అధ్యయనంలో పాల్గొన్న వారంతా కలయికలో ఎలాంటి నిరుత్సాహాన్ని ప్రదర్శించడంలేదు. ఈ విషయంలో లింగపరమైన భేదాలు లేకుండా ప్రతిఒక్కరూ అందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేశారు. అదేసమయంలో గర్భం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

  • 2,245 మంది మహిళలు, 3,538 మంది పురుషులు 
  • 18 నుంచి 32 ఏండ్ల మధ్య వయసున్న వారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 
  • 81.90% కరోనా నేపథ్యంలో గర్భం వద్దను కునేవాళ్లు
  • 68% ఆర్థిక సంక్షోభంలో పిల్లల ఆలోచనే లేదంటున్నవారు
  • 73% ఒకవేళ గర్భం దాల్చిన తరువాత కరోనాబారిన పడితే కలిగే ఇబ్బందులను తట్టుకోలేమంటున్నవారు


logo