e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home తెలంగాణ భైంసాలో జరిగిందిదీ!

భైంసాలో జరిగిందిదీ!

  • చిలికి చిలికి గాలివానగా మారిన గొడవ
  • 5 నిమిషాల్లోనే ఘటనాస్థలికి పోలీసులు
  • రెండు గంటల్లోనే పరిస్థితి అదుపులోకి 
  • నలుగురు మైనర్లు సహా 42 మంది అరెస్టు
  • ఇద్దరు సీపీల నేతృత్వంలో దర్యాప్తు
  • భైంసా ప్రజలు సంయమనం పాటించాలి
  • పోలీసులపై నిందలు సరికావు: ఐజీ నాగిరెడ్డి 

హైదరాబాద్‌, మార్చి 16, (నమస్తే తెలంగాణ): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఈ నెల ఏడున రెండువర్గాల మధ్య చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని నార్త్‌జోన్‌ ఐజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తుచేస్తున్నారని.. తమపై ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టంచేశారు. ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోపే ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లారని, రెండు గంటల్లోపే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. భైంసా పట్టణ ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఈ నెల 7 రాత్రి భైంసాలో జరిగిన ఘటన వివరాలను మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

చిన్న గొడవతోనే మొదలు 

ఈ నెల 7 రాత్రి 8.20 గంటల సమయంలో తోట మహేశ్‌, దత్తు పటేల్‌ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ..జుల్ఫీకర్‌ గల్లీలోని మసీద్‌ దగ్గర రోడ్డుపై పోతున్న రిజ్వాన్‌ను వెనుకనుంచి కొట్టారు. రిజ్వాన్‌ తన స్నేహితులైన సమీర్‌, మినాజ్‌లతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. తనను కొట్టడంతో ఆగ్రహించిన రిజ్వాన్‌.. పది నిమిషాల తరువాత కొంతమంది స్నేహితులను వెంటేసుకొని.. బట్టీ గల్లీకి చేరుకొని మహేశ్‌ కోసం వెతకసాగారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన దత్తు, రాకేశ్‌, గోకుల్‌, మహేశ్‌ (వీరంతా హిందూ వాహినికి చెందినవారు)..  రిజ్వాన్‌, అతని స్నేహితులను కొట్టారు.  తర్వాత దత్తు మళ్లీ జుల్ఫీకర్‌ గల్లీకి వెళ్లి అక్కడ ఉన్న మరో వర్గానికి చెందిన యువతతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణ రాళ్ల దాడికి కారణమైంది.  ఇట్లా రాజుకున్న గొడవ పెద్దది కావడంతో అక్కడే పికెట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రమణయాదవ్‌ వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు ఇటుకతో దాడిచేసి అతడిని గాయపరిచారు. రమణయాదవ్‌ ఇచ్చిన సమాచారంతో  ఐదు నిమిషాల్లోపే పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. టీఎస్‌ఎస్పీ, స్పెషల్‌ పార్టీలకు చెందిన ఒక ప్లాటూన్‌ సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈలోపే సమాచారం పట్టణంలోకి పాకడంతో పన్‌జేషా మసీదు ప్రాంతం, కార్బా గల్లీ, బట్టల వ్యాపారుల రోడ్డు, పురానా బజార్‌, మార్కెట్‌ రోడ్డులలో రాళ్లదాడులు, వాహనాల దగ్ధం, షాపుల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి. నాలుగు ఇండ్లు, 13 దుకాణాలు, నాలుగు ఆటోలు, ఆరు కార్లు, ఐదు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలో మొత్తం 26 కేసులు నమోదయ్యాయి. నలుగురు మైనర్లతోపాటు 42 మందిని అరెస్టుచేశారు.   9 మంది పౌరులు, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.  మరో 70 మందికి సంఘటనతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలినట్టు నాగిరెడ్డి చెప్పారు.  

నాయకులు.. ఇద్దరు కౌన్సిలర్లు 

దాడిలో పాల్గొన్న వారు పదిహేనో వార్డు కౌన్సిలర్‌ అబ్దుల్‌ ఖబీర్‌ అలియాస్‌ బాబా (ఎంఐఎం), ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ తోట విజయ్‌ (హిందూ వాహిని మాజీ అధ్యక్షుడు) నేతృత్వంలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడ్డారని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. పోలీసులు గుర్తించిన వారిలో ఒక వర్గంలో సంతోష్‌ (హిందూవాహిని అధ్యక్షుడు), తోలాజి రాకేశ్‌, దత్తు పటేల్‌, గోకుల్‌, లింగోజి, క్రాంతి, బాలాజీ, జగదీశ్‌ తదితరులు ఉండగా.. రెండోవర్గంలో సాజిద్‌ఖాన్‌, సమీర్‌, ఇమ్రాన్‌ అహ్మద్‌, షేక్‌పాషా, మీర్జా ఖాన్‌, షేక్‌ రిజ్వాన్‌, అక్బర్‌ఖాన్‌, మజర్‌ఖాన్‌, మీరజ్‌ఖాన్‌, మినాజ్‌ఖాన్‌ తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. 

నిష్పాక్షికంగా దర్యాప్తు

ఘటన సమాచారం అందిన వెంటనే ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌, రామగుండం సీపీ సత్యనారాయణ, డీసీపీ మంచిర్యాలతోపాటు మరో ఇద్దరు యువ ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని నాగిరెడ్డి చెప్పారు. పట్టణంలో 144వ సెక్షన్‌ను విధించామని చెప్పారు. పొరుగున ఉన్న ఆదిలాబాద్‌, జగిత్యాల, రామగుండం, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలనుంచి అదనపు బలగాలను రప్పించామని వెల్లడించారు.  శాంతిభద్రతల పరిరక్షణను రామగుండం సీపీ సత్యనారాయణకు, కేసుల దర్యాప్తును వేగం చేసేందుకు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డిని ప్రత్యేకంగా నియమించినట్టు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌రికార్డులు సహా అన్ని రకాల సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. 27 పికెట్లు, ఆరుగురు డీఎస్పీలు, పదిమంది సీఐలు, 32 మంది ఎస్సైలు, ఇతర కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 525 మంది పోలీసులు నిత్యం బందోబస్తు చేస్తున్నట్టు తెలిపారు. వీరితోపాటు ఒక టీఎస్‌ఎస్పీ, రెండు స్పెషల్‌ పోలీస్‌ కలిపి మొత్తం మూడుపార్టీలను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.  

ఎవరినీ వదిలేది లేదు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారెవరైనా వదిలేది లేదని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. దోషులు ఎవరైనా.. ఏ సంస్థకు చెందినవారైనా సరే అరెస్టుచేసి .. శిక్షిస్తామని స్పష్టంచేశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. భైంసా ప్రజలు మతసామరస్యంతో శాంతియుతంగా జీవించాలని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

అల్లర్లకు లైంగికదాడితో సంబంధం లేదు

ఓ చిన్నారిపై లైంగికదాడి కేసుతో భైంసా అల్లర్లకు ఎలాంటి సంబంధం లేదని నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటన భైంసాకు పక్కన ఉన్న గ్రామంలో జరిగిందని స్పష్టంచేశారు. చిన్నారిని.. ఆమె తల్లిదండ్రులు భైంసా దవాఖానకు తీసుకొచ్చారని.. వారు పెద్దగా చదువుకోకపోవడం వల్ల పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పక్కాగా కొనసాగుతున్నదని.. నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచామని నాగిరెడ్డి తెలిపారు. 

Advertisement
భైంసాలో జరిగిందిదీ!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement