సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 00:16:35

సంక్షేమభవన్లు.. ఆత్మగౌరవ ప్రతీకలు

సంక్షేమభవన్లు.. ఆత్మగౌరవ ప్రతీకలు
  • రూ.66.40 కోట్లతో గిరిజనభవన్ల నిర్మాణం
  • తుదిదశలో బంజారా, కుమ్రంభీం భవన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనభవన్లను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.66.40 కోట్ల నిధులను ప్రత్యేకంగా మంజూరుచేసింది. గిరిజనుల సంస్కృతిని కాపాడి భవిష్యత్‌ తరాలకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చేపట్టిన బంజారాభవన్‌, కుమ్రంభీంభవన్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. త్వరలోనే ఈ భవనాలను అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్ల చొప్పున మంజూరుచేసింది. 


జిల్లాల పరిధిలో 24 భవనాలు

గిరిజనులు అధికసంఖ్యలో నివాసం ఉండే ప్రాం తాల ఆధారంగా ఆయా జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గిరిజనభవన్లను నిర్మిస్తున్నారు. మరికొన్నింటిని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనుమతించినవాటిలో ఒక్కో గిరిజనభవన్‌ నిర్మాణానికి రూ.1.10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 24 గిరిజనభవన్ల కోసం ప్రభుత్వం రూ. 26.40 కోట్లు మంజూరుచేసింది. ఖమ్మం, భద్రాచలం, పినపాక, ఇల్లందు, వైరా, అశ్వారావుపేట, వరంగల్‌, ఏటూరునాగారం, డోర్నకల్‌, మహబూబాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌, ఉట్నూరు, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌, మహబూబ్‌నగర్‌, మన్ననూరు, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, దేవరకొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌లో మొదలైన గిరిజనభవన్ల నిర్మాణపనులు తుదిదశకు చేరాయి.


logo