సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 11:25:49

రాష్ట్రంలో మారిన వాతావరణం.. ఉదయం నుంచి జల్లులు

రాష్ట్రంలో మారిన వాతావరణం.. ఉదయం నుంచి జల్లులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండ టంతో గత కొన్నిరోజులుగా చలి వణికిస్తున్నది. అయితే నిన్నటి నుంచి మబ్బులతోపాటు పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, అక్కడక్కడ మోస్తరుగా వర్షం పడుతున్నది. మన్నార్‌ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి వరకు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు ప్రకటించారు. 


ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో, ఖమ్మం పట్టణంలో చిరు జల్లులు కురుస్తుండగా, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్‌, బీబీపేట్‌, తాడ్వాయి, రామారెడ్డి, రాజంపేట మండలాల్లో ముసురు కురుస్తున్నది. నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, మోపాల్‌ మండలాల్లో మోస్తరు వాన పడుతున్నది. కాగా, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో భారీ వర్షంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. మిగిలిన ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. మేఘాలు దట్టంగా ఆవరించి ఉండటంతో వాతావరణం మరింత చల్లగా మారింది.