శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 15:16:45

దుబ్బాకలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం

దుబ్బాకలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం

సిద్దిపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఒకే జీవితంలో మూడు అవతారాలు సక్సెస్ ఫుల్ గా చూశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో సోలిపేట రామలింగారెడ్డి యాదిలో 'స్వప్న సాధకుడు' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..వామపక్ష భావ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ప్రజాప్రతినిధిగా ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు.

వారు స్టేజీ వివాహం చేసుకోవడమే కాదు, వారి పిల్లలకు సైతం స్టేజీ వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలిచారన్నారు. అధికారంలో ఉన్నా సమస్యలుంటే ప్రతిపక్ష పాత్ర పోషించేవారన్నారు. రాష్ట్రమంతా నీళ్లు పొంగిపొర్లుతున్నా ఇంకా సింగూరు నిండలేదు. కాళేశ్వరం ద్వారా గోదావరి దారను మంజీరాతో కలిపి దాన్ని జీవధారగా మార్చే బృహత్తర ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతేడాది 27 లక్షల వరి సాగు జరిగితే ఈ సారి 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని వివరాలను వెల్లడించారు. 


ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇదంతా మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు విజయవంతంగా నిర్మించుకోవడం వల్లనే  సాధ్యమైందని గుర్తు చేశారు. దుబ్బాకకు రామలింగారెడ్డి తాగు నీరందించారు. సాగు నీరందించే చివరి దశలో వారు లేక పోవడం బాధాకరమన్నారు. మరికొద్ది రోజుల్లో ఇంటింటికి తాగు నీరు, ప్రతి ఎకరాకు సాగు నిరందించాలనే లింగన్న స్వప్నాన్ని త్వరలోనే నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి, మరసం జిల్లా అధ్యక్షుడు రంగాచారి తదితరులు పాల్గొన్నారు.