గురువారం 09 జూలై 2020
Telangana - Feb 23, 2020 , 22:34:00

హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత నగరంగా తీర్చిదిద్దుతాం: మేయర్‌

హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత నగరంగా తీర్చిదిద్దుతాం: మేయర్‌

హైదరాబాద్‌: నిరాక్షరాస్యతను రూపుమాపి, హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత గల నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపటి నుంచి మార్చి 4వ తేది వరకు నిరక్షరాస్యుల సర్వే నిర్వహించనున్నట్లు మేయర్‌ తెలిపారు. నగరంలోని 150 వార్డులను 5,704 ఆవాస ప్రాంతాలుగా గుర్తించామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వివరించారు. నగరంలో మొత్తం 24 లక్షల 78 వేల కుటుంబాలు నివసిస్తున్నాయని ఈ సందర్భంగా మేయర్‌ తెలిపారు. ఆయా కుటుంబాలను బ్లాకులుగా విభజించి, నిరక్షరాస్యతపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రతి బ్లాక్‌కు ఒకరు చొప్పున 8,681 మంది ఎన్యుమరేటర్లను నియమించామని మేయర్‌ తెలిపారు. రాయడం, చదవడం రాని వారి వివరాలను సర్వేలో సేకరిస్తామని ఆయన అన్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత, ప్రతి వార్డులో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి, అక్షరాస్యత దిశగా దూసుకెళ్తామన్నారు. నిరాక్షరాస్యతపై యుద్ధం చేసి, గెలిచి తీరుతామనీ.. తమ లక్ష్యాన్ని అతి త్వరగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మేయర్‌ తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.  


logo