మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 19:14:35

డిజిటల్ లిటరసీ ద్వారా గిరిజన యువతను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం

డిజిటల్ లిటరసీ ద్వారా గిరిజన యువతను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాల్లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం నేడు అనేక మంది గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన యువకులను డ్రైవర్ల నుంచి ఓనర్లుగా మార్చే డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద 31 మంది గిరిజన యువకులకు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి కార్లను పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ పథకం కింద గత రెండేండ్లలో దాదాపుగా 500 మంది గిరిజనులకు కార్లు ఇచ్చామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరో 1000 మందికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. ట్రైకార్ సంస్థ, మారుతి సుజుకి, ఉబర్ సంయుక్తంగా గిరిజన యువతకు కార్లను పంపిణీ చేయడం, ఉత్తమ డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడం, కార్లు తీసుకున్న తర్వాత కిరాయిలు దొరకకపోతే ఇబ్బంది పడవద్దని ఉబర్ సంస్థతో ఒప్పందం చేయించడం వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. 


ఒక్క ఎస్.బి.ఐ ద్వారానే ఇప్పటి వరకు 2,500 మందికి కార్లను ఇచ్చారంటే ఈ పథకం కింద ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో ఆలోచించాన్నారు. కేవలం డ్రైవర్లను ఓనర్లుగా చేయడమే కాదన్నారు. గిరిజనులకు డిజిటల్ లిటరసీ ఇవ్వడం ద్వారా టెక్నాలజీలో వారిని నిష్ణాతులుగా మార్చి, టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పించే ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమం కూడా ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు కార్యదర్శి శ్రీధర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా, ఉబర్, మారుతి సుజుకీ, ఎస్.బి.ఐ ప్రతినిధులు పాల్గొన్నారు. 




logo