శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 01:19:19

హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌

హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌

  • బండి సంజయ్‌ బరితెగింపు మాటలు 
  • మేయర్‌ పీఠం గెలిస్తే మెరుపు దాడులు చేయిస్తారట!
  • పచ్చని నగరంలో చిచ్చుపెట్టే కుట్ర.. 
  • పెచ్చరిల్లిన కమలనాథుల మతోన్మాదం
  • ఓట్లకోసం బీజేపీ విద్వేష పన్నాగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. సామాన్య ప్రజల పట్ల ఆర్తిలేదు.. ప్రేమ లేదు.. బీజేపీ నేతలకు ఉన్నది ఒక్కటే ఎజెండా.. అది మతం.. మతాల మధ్య చిచ్చు పెడితేనే  నాలుగుఓట్లు పడతాయని వాళ్ల గుడ్డినమ్మకం. దానికి వారు ఎంతకైనా బరితెగిస్తారనడానికి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం చేసిన ప్రేలాపనలే తార్కాణం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటినుంచి మతోన్మాదమే పునాదిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా మంగళవారం చిలుకానగర్‌లో జరిగిన ప్రచారసభలో సంజయ్‌ మాట్లాడుతూ తాము ఎన్నికల్లో గెలిచి మేయర్‌ పీఠం అధిష్ఠిస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని హెచ్చరించారు. 

‘నిన్న ఒవైసీ అంటున్నడు.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నరంట.. రోహింగ్యాలు ఉంటే అమిత్‌షా ఏం చేస్తున్నరని అంటున్నడు.. బిడ్డా.. ఈ ఎన్నికల్లో బీజేపీ మేయర్‌ అభ్యర్థిగా గెలిచిన తర్వాత.. బిడ్డా.. నీ పాతబస్తీ మీద.. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి ఈ రోహింగ్యాలను, ఈ పాకిస్తాన్‌ నా కొడుకులను తరిమి తరిమి కొట్టే బాధ్యత ఇవాళ భారతీయ జనతాపార్టీ తీసుకొంటది’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సంజయ్‌ గతంలోనూ పాతబస్తీలో ఉన్నవాళ్లంతా రోహింగ్యాలు, పాకిస్తానీలు అని వ్యాఖ్యానించారు. సంజయ్‌  తాజా వ్యాఖ్యలు అన్ని వర్గాల్లో భయాందోళనలకు కారణమయ్యా యి. 

పచ్చని హైదరాబాద్‌లో  చిచ్చుపెట్టేందుకు  బీజేపీ ఈ విధమైన వ్యాఖ్యలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని విద్వేషపూరితంగా మార్చడానికి బీజేపీ కుట్రలుచేస్తున్నదని అధికార టీఆర్‌ఎస్‌ గతం నుంచి చేస్తున్న ఆరోపణలు బండి వ్యాఖ్యలతో నిజమేనని తేలింది. ఎన్నికల కోడ్‌ నాటినుంచి ప్రజలను  రెచ్చగొట్టేందుకే సంజయ్‌ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నదని, ప్రజలను భయభ్రాంతులకు  గురిచేసి ఓట్లు పొందాలని ఆపార్టీ భావిస్తున్నదని ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. ప్రశాంతంగా  జీవిస్తున్న నగర ప్రజలను చిందరవందరచేసే కుట్రకు పాల్పడటం బీజేపీకి తగదని హితవు పలుకుతున్నారు.

మౌఢ్యం ముదురుతున్నది.. విద్వేషం పిలకలేస్తున్నది! మతోన్మాద గండం ముంచుకొస్తున్నది.. మన ఐక్యతను దెబ్బతీసేందుకు ఉరకలేస్తున్నది! ప్రతి మాట వెనుక అశాంతి రేపే కుట్ర.. ప్రతి వ్యాఖ్య వెనుక సామరస్యంపై దూసే కత్తి! ఇప్పుడు మరింత బరితెగించింది..అందమైన నందనంలోకి మిడతల దండు దండెత్తుతున్నది!.. బహు పరాక్‌..!!

హైదరాబాద్‌ మహానగర ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు.. నగర అభివృద్ధికి వేసిన రాచబాట జీర్ణంకాని శక్తులు.. ఓట్లు రాల్చుకునేందుకు విద్వేష యంత్రాన్ని తిప్పుతున్నాయి! తమకు అలవాటైన అసత్యాల మాధ్యమాల్లో చల్లిన విషం చాలటం లేదేమో.. నేరుగానే మనిషి నుంచి మనిషిని విడదీస్తామంటున్నారు బీజేపీ నాయకులు! 

రాజకీయాలు, సిద్ధాంతాల ఆధారంగా.. సాధించిన ప్రగతి.. చేయబోయే అభివృద్ధి ప్రాతిపదికన సాగే ఎన్నికల ప్రచారాన్ని ఒక నాయకుడు హిందూ, ముస్లిం మధ్య పోటీగా తేల్చేస్తే.. తాజాగా మరో నేత ఏకంగా మేయర్‌ పీఠం దక్కిన వెంటనే హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని బెదిరిస్తూ హద్దులు దాటేశాడు! సంప్రదాయకంగా మినీ ఇండియాగా భాసిల్లుతూ.. సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థలతో మినీ వరల్డ్‌ను తలపిస్తూ, అభివృద్ధిలో, పెట్టుబడుల్లో అగ్రస్థానాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ భవితవ్యానికి పెను సవాలు విసిరాడు! 

ఆ సవాలును తిప్పికొట్టడమా? పట్టుతప్పి పడిపోవడమా? ఇప్పుడు మన చేతిలోనే!అడ్డుకోవడమా? తరిమికొట్టడమా? ఇక మన చైతన్యం పైనే!