శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 14:56:04

సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తాం

సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తాం

మహబూబ్‌నగర్‌ : వచ్చే యాసంగి నాటికి రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ గోదామును, చిన్నచింతకుంట మండలం బండర్ వల్లి గ్రామంలో రూ. 3 కోట్లతో నిర్మించిన మార్కెట్  గోదామును మంత్రి ప్రారంభించారు. లాల్కోట గ్రామ సమీపంలోని బండ్రవల్లి వాగుపై సుమారు రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు భూమి పూజ చేశారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్‌ శాస్త్రవేత్తలు, అధికారులు ,రైతులు, ఇతరులతో కసరత్తు ప్రారంభించారని తెలిపారు. ఈ విషయమై సీఎం త్వరలోనే రైతులు, రైతుబంధు సభ్యులు, శాస్త్రవేత్తలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో సన్న వడ్లు, కంది, వేరుశెనగ విస్తీర్ణం పెంపుదల, ఆయిల్ పామ్ తోటల పెంపకం తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని.. అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా, వచ్చే యాసంగి నాటికి మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి  మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఏక పక్షమని ,రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తున్నదని, ఈ విషయంలో  రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 


logo