బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 19:51:53

వారం రోజుల్లో ఎల్లూరు లిఫ్ట్ మోటార్ల‌ను తిరిగి ప్రారంభిస్తాం

వారం రోజుల్లో ఎల్లూరు లిఫ్ట్ మోటార్ల‌ను తిరిగి ప్రారంభిస్తాం

నాగర్‌కర్నూల్ : వారం ప‌ది రోజుల్లో ఎల్లూరు లిఫ్ట్ మోటార్ల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని రాష్ర్ట మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తెలిపారు. కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ... ఎల్లూరు లిఫ్ట్ మునిగి పోవడం బాధాకరమ‌న్నారు. విద్యుత్ ఉపకరణాలలో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయ‌న్నారు. సీల్ సాఫ్ట్ ఎగిరిపోవడం వల్ల మోటర్లు మునిగిపోయిన‌ట్లు తెలిపారు. కాగా కంట్రోల్ ప్యానెళ్లు సురక్షితంగానే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డి వాటరింగ్ ప్రక్రియను వేగంగా చేపట్టి వారం పది రోజుల్లో ఒక మోటార్‌ను తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. సమస్య తెలిసిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నతాధికారుల‌కు స‌మాచారం అందించార‌న్నారు. 

ఎవరైనా కావాలని చేస్తారా? ఇంట్లో, వ్యవసాయ పొలాల్లో మోటార్లు కూడా కాలిపోతుంటాయి కదా.  ఏదో పెద్ద జరగరానిది జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు తప్పులు చేశారనడం అవాస్తవం అన్నారు. అంత ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేద‌న్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నార‌న్నారు. 30 ఏళ్లల్లో కట్టే కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలనేది సీఎం కేసీఆర్ కల అని తెలిపారు. పాలమూరు జిల్లాకు ఇంకా ఏమి చేయాలో సీఎం కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు చెప్పారు. రైతులెవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం అమ‌లు చేయని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ సర్కార్‌దే అని పేర్కొన్నారు.


logo