గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:01:35

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ఖైరతాబాద్‌: ఎస్సీ, ఎస్టీల్లోని అన్ని ఉపకులాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాదిగ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి అన్నారు. ఉపకులాలకు రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ అంశాన్ని ఫుల్‌బెంచ్‌కు పంపడంపై హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాధికారం కల్పిస్తూ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలని కోరారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల చివరి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్టు రవి తెలిపారు. కోర్టు తీర్పుపై మందకృష్ణ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని,ఈ కేసునుంచి ఆయన ఎప్పుడో బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఓట్ల రాజకీయాలకు దగ్గరై, వర్గీకరణ ఉద్యమానికి దూరమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ఎంఎస్పీని వీడి బయటకు రావాలని హితవుపలికారు.  

సుప్రీం తీర్పుపై టీఎమ్మార్పీఎస్‌ హర్షం

కవాడిగూడ: ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ స్వాగతించారు. ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల్లోని వెనుకబడినవర్గాల్లో రిజర్వేషన్‌ ఫలాలు కిందిస్థాయికి చేరాలంటే రాష్ర్టాలకు అధికారం ఇవ్వాలన్నారు.


logo