గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 13:34:22

క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నాం : కేటీఆర్‌

క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నాం : కేటీఆర్‌

హైదరాబాద్ : క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద సాయం అందరికీ ఇచ్చామని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం చేస్తామన్నారు. వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ నేడు తెలంగాణ భవన్‌లో మీడియా ద్వారా మాట్లాడారు. 1908లో మూసీకి వరదలు పోటెత్తాయని చరిత్ర చెబుతోంది. 1916 తర్వాత ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ చరిత్రలో అతిపెద్ద వర్షపాతం ఈ ఏడాదే నమోదైంది. 

మానవ తప్పిదాల వల్లనే ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్లే వందలాది కాలనీలు నీటమునిగాయన్నారు. ప్రభుత్వం అప్రమత్తతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిందన్నారు. చాలావరకు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగామన్నారు. వైపరీత్యాలను ఎదుర్కొవడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 800 మందితో డీఆర్‌ఎఫ్‌ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనతో పాటు ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల గోడును ఆలకించారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత సీఎం కేసీఆర్‌కు నివేదించడంతో తక్షణసాయం కింద సీఎం కేసీఆర్‌ రూ. 550 కోట్లు కేటాయించారన్నారు. బాధితులకు రూ. 10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. 

4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరదసాయం అందించినట్లు తెలిపారు. దసరా లోపే వరద సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు వరదసాయం అందిన బాధితుల వివరాలను సేకరించాం. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించాం. 920 బృందాలను ఏర్పాటు చేసి వరద సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశామన్నారు. తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ బురద రాజకీయం చేశాయని మండిపడ్డారు. అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నరన్నారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు చేయించారన్నారు.


అవసరమైతే మరో రూ.100 కోట్లు..

కేసీఆర్‌ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైతే మరో రూ. 100 కోట్లు కేటాయించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలకు ప్రజలు లోనుకావొద్దని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. మన హైదరాబాద్‌-మన బీజేపీ అంటూ నినాదాలు ఇస్తున్నారని.. హైదరాబాద్‌కు ఏం చేశారని మన హైదరాబాద్‌ అంటున్నారరన్నారు.  

తెలంగాణ పట్ల ప్రధానికెందుకీ వివక్ష..

 కర్ణాటక, గుజరాత్‌పై ఉన్న ప్రేమ ప్రధానికి తెలంగాణపై ఎందుకు లేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. బెంగళూరుకు మూడు రోజుల్లో సహాయం ప్రకటించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్‌ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ రాసినా ఫలితం లేదన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే స్వయంగా వెళ్లి నిధులు విడుదల చేసిన ప్రధాని హైదరాబాద్‌ విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్రాన్ని రూ.13 వేల కోట్లు అడిగితే నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర సహాయమంత్రి, ఎంపీలు ఉండి తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయ మంత్రా చెప్పాలన్నారు.