సోమవారం 13 జూలై 2020
Telangana - Mar 28, 2020 , 01:07:26

ఒక్కరి కడుపు కూడా మాడొద్దు

ఒక్కరి కడుపు కూడా మాడొద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మీ బిడ్డగా తెలంగాణ యావత్తు ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా. ఒక మాట మీకు హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఏ రాష్ట్రం వారుఉన్నా, ఏ ప్రాంతం వారు ఉన్నా వారందరికి కడుపునిండా భోజనం పెడుతాం. ఎవరినీ ఎండబెట్టం. హాస్టల్‌ బంద్‌ చేయం’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలోని గృహ నిర్మాణరంగంలో, నీటిపారుదలశాఖ కాంట్రాక్టర్ల వద్ద, రైస్‌ మిల్లులు, పౌల్ట్రీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నవారిలో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారన్నారు. వారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, వారి కడుపు మాడ్చొద్దని కేసీఆర్‌ సూచించారు. గృహ నిర్మాణరంగానికి సంబంధించిన అసోసియేషన్లు మున్సిపల్‌శాఖ మంత్రిని కలిసి కార్మికులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో పేదలు, యాచకులు, నైట్‌ షెల్టర్లలో, అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు, రకరకాల వృత్తుల్లో ఉన్నవారు, ఎవరైనా సరే వారు ఎట్టిపరిస్థితుల్లో ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. అధికారులు ఖర్చుకు వెనకాడొద్దని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ చుట్టూ ఉన్న పీర్జాదిగూడ, బోడుప్పల్‌, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ జాగీరు, జల్‌పల్లి, మీర్‌పేట, జవహర్‌నగర్‌లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలవారు, కూలీలు ఉన్నారని.. మున్సిపల్‌శాఖ మంత్రి, అధికారులు కలిసి వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఏపీకి సంబంధించిన పిల్లలు కొంత అయోమయానికి గురవుతున్నారని అన్నారు. హాస్టళ్లను మూసివేయబోరని కేసీఆర్‌ స్పష్టంచేశారు. విద్యార్థులు ఇక్కడే ఉండాలని సూచించారు. దేశంలో హైఎండ్‌ టెక్నాలజీ లేదని, వేలకొద్ది వెంటిలేటర్లు లేవని, వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు అని చెప్పారు. యావత్తు ప్రపంచమే యుద్ధంలో పాల్గొంటున్న పరిస్థితి ఉన్నదని, దేశం మొత్తం కర్ఫ్యూలోనే ఉన్నదని, ఇలాంటి పరిస్థితిని చరిత్రలో ఏనాడూ చూడలేదని సీఎం చెప్పారు.


logo