బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:48:53

మహిళలకు వీహబ్‌ బాసట

మహిళలకు వీహబ్‌ బాసట
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులకు చేయూత
  • సంస్థ ద్వితీయ వార్షికోత్సవంలో సీఈవో దీప్తి రావుల

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వివిధ రంగాలపట్ల ఆసక్తిగల మహిళలు పారిశ్రామికవేత్తలు గా ఎదగాలని వీహబ్‌ సీఈవో దీప్తి రావుల ఆకాంక్షించారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటుచేసిన ఇంక్యుబేటర్‌ ‘వీ-హబ్‌' అని, ఇటువంటిది ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మహిళా పారిశ్రామికవేత్తలను బలోపేతం చేసేందుకే వీహబ్‌ పనిచేస్తుందని చెప్పారు. ఔత్సాహిక మహిళలకు సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న మార్కెటింగ్‌ సమస్యను అధిగమించేలా వారిని ప్రోత్సహిస్తూ, అవకాశాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


రంగాలవారీగా మొదటివిడతలో 26 ఇంక్యుబేటర్లను ప్రోత్సహించామని, రెండోవిడతలో 16 ఇంక్యుబేటర్లకు ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశంకోసం ఎదురుచూస్తున్న, నైపుణ్యం కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలకు సహకారం అందజేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో ఇంక్యుబేషన్‌, యాక్సిలరేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్నదని దీప్తి రావుల తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థిదశ నుంచే బాలికలు దృష్టిసారించే లా వీహబ్‌ పనిచేస్తుందన్నారు. 62 స్టార్టప్‌లకు వీహబ్‌ ద్వారా నేరుగా ప్రోత్సాహం అందించామని, ప్రతినెలా 200కుపైగా బయటనుంచి వచ్చే స్టార్టప్‌లకు అవసరమైన చేయూతను ఇస్తున్నామని దీప్తి పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి అన్ని జిల్లాల్లో ఇంక్యుబేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 


logo
>>>>>>