కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ

సిద్దిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ప్యాకేజీని అందించినట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన వారికి ప్రభుత్వం ఉత్తమ ప్యాకేజీని అందజేసిందన్నారు. ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు త్యాగాలు చేసిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రాజెక్టు నిర్వాసితులేనన్నారు. అందుకే నిర్వాసితుల బాధలు తెలిసిన సీఎం మానవతా ధృక్పథంతో ఆదుకున్నారన్నారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల నిమిత్తం జిల్లాలో 28 వేల మంది రైతుల నుంచి 50 వేల ఎకరాలను సేకరించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో మునిగిన 13 గ్రామాల వాసులకు పునరావాసం కల్పించినట్లు చెప్పారు. నిర్వాసితులను ఆదుకోవడంలో దేశానికే ఉదాహరణగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వి.రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పోలీస్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్, అదనపు కలెక్టర్లు ఎస్. పద్మాకర్, ముజమ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.