గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:08:40

మత కలహాలు మాకొద్దు

మత కలహాలు మాకొద్దు

  • ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొట్టొద్దు
  • మతసామరస్యం ఇలాగే కొనసాగాలి
  • టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి 
  • నగరానికి ప్రపంచస్థాయి పెట్టుబడులు
  • దేశంలోనే సీఎం కేసీఆర్‌ గొప్ప నేత
  • మీడియాతో సినీ డైరెక్టర్‌ ఎన్‌ శంకర్‌, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్లు.. ఇలా వివిధ మతాల ప్రజలు హైదరాబాద్‌లో ఆనందంగా జీవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఓట్ల కోసం మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకండి. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించదు’ అని ప్రముఖ సినీ డైరెక్టర్‌ ఎన్‌ శంకర్‌ అన్నారు. అబద్ధాలు మాట్లాడటం, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. శాంతిభద్రతలను కాపాడుతూ, నగరఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన టీఆర్‌ఎస్‌కే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లువేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ నటుడు పోసా ని కృష్ణమురళితో కలిసి శంకర్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉన్నదని తెలిపారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ అహింసామార్గంలో నడిపించారని, ఇప్పుడు మతకలహాల చేదు అనుభవం మళ్లీ హైదరాబాద్‌కు అవసరంలేదని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని చెప్పిన మాటలను సీఎం కేసీఆర్‌ పటాపంచలు చేసి అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని ప్రశంసించారు. శాంతిభద్రతలు.. ముఖ్యంగా మహిళా రక్షణలో హైదరాబాద్‌ ఇతర మె ట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. అతిభారీ వర్షాలతో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తితే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రజలకు అండగా నిలిచారని చెప్పా రు. ఏండ్లనుంచి జరిగిన ఆక్రమణల వల్లనే వరదలు ముంచెత్తినా గత పాలకుల తప్పిదాలని చెప్తూ తప్పించుకొనే ప్రయత్నం చేయలేదని తెలిపారు.  నీళ్లు, కరెంట్‌, రోడ్లు, అనుమతులు.. ఇలా అన్ని విషయాల్లో హైదరాబాద్‌ను ఇతర నగరాలకు దీటుగా అభివృద్ధి చేశారని మెచ్చుకున్నారు. టీఎస్‌ ఐపాస్‌, టీఎస్‌బీపాస్‌లు పారదర్శకతకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్‌ 5 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు నగరానికి తరలిరావటంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పాత్ర అభినందనీయమని చెప్పారు. కేసీఆర్‌ వంటి విజన్‌ ఉన్న నాయకులను గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించేలా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటువేయాలని, ప్రభుత్వానికి చేయూతనివ్వాలని వారు విజ్ఞప్తిచేశారు. 

గతంలో చేదు అనుభవాలు: శంకర్‌

గతంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. నాడు పాతబస్తీ అంటే భయంకర వాతావరణం కల్పించారు. తెలంగాణ ఏర్పడ్డాక గూండాయిజం, రౌడీయిజం లేకుండా పోయాయి. మతకలహాల మాటేలేకుండా ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఏనాడూ హిందూముస్లిం మధ్య వివాదాలు జరుగలేదు. కలిసి పోరాటం చేసి రాష్ట్రం సాధించాం. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయొద్దు. 

ప్రతి ఆంధ్రా బిడ్డ సంతోషంగా ఉన్నడు: పోసాని

ఉద్యమ సమయంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న కొందరు ఆంధ్రా నాయకులపై సీఎం కేసీఆర్‌ కోపం ప్రదర్శించారే కానీ, ఆంధ్ర ప్రజలను ఎప్పుడూ ఏమనలేదు. వారికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి ఆంధ్రా బిడ్డ సంతోషంగా ఉన్నాడు. శాంతిభద్రతలు అద్భుతంగా ఉండటంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. అభివృద్ధి కావాలంటే కచ్చితంగా టీఆర్‌ఎస్‌కే ప్రజలు ఓటేయాలి. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ తెలంగాణలో నాకు నచ్చిన నేత మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధిని కాంక్షించే కేసీఆరే. దేశంలోనే కేసీఆర్‌ అంత గొప్ప నాయకున్ని నేనెప్పుడూ చూడలేదు. 


బీజేపీ వ్యవహారం చూస్తే బాధ కలుగుతున్నది. ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యలు మంచివి కాదు. వేదాలను గౌరవిస్తే, గోమాతను పూజిస్తే ఇలాంటి భాష మాట్లాడుతారా?

పీర్లు, బతుకమ్మలు కలిసి తిరిగే ప్రాంతం ఇది. గంగాజమునా తెహజీబ్‌ సంస్కృతి విచ్ఛిన్నానికి యత్నిస్తే ప్రజలు సహించరు.  ఓట్ల రాజకీయం చేస్తున్నారో ఆలోచిస్తున్నారు.

ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. రాజకీయాల కోసం జనాన్నివిడగొట్టొద్దు. అభివృ ద్ధి ప్రాతిపదికన ప్రజలను ఓట్లు అభ్యర్థించాలి.

దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా కేసీఆర్‌ యాగాలు చేశారు. చరిత్రలో నిలిచేలా యాదాద్రి ఆలయం నిర్మిస్తున్నారు. ఇంతకంటే పెద్ద హిందువు ఎవరుంటారు.

భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి తానీషా ఎలాగైతే తలంబ్రాలు ఇచ్చారో.. అలాగే హైదరాబాద్‌ ప్రజలు స్నేహపూర్వక జీవనాన్ని ఎంచుకున్నారు.

బడిని, గుడిని, మసీదును, చర్చిని.. అన్నింటిని సమంగా చూస్తూ, అన్నివర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ హైదరాబాద్‌కు, తెలంగాణకు పెద్ద రక్ష.

హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలను కేసీఆర్‌ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఆరున్నరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క ఆంధ్రా బిడ్డ ఇబ్బందులకు గురికాలేదు. 

హైదరాబాద్‌కు ఇంతటి వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతసాయం చేయాలో అంత చేశారు. సమస్య పూర్తి పరిష్కారం కోసం తపిస్తున్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాలు చూడొద్దు. అభివృద్ధి కోణంలో చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేయాలి.

ఒకప్పుడు కరెంటు కోతల వల్ల అందరూ ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుక్కొనేవారు. చిన్న పరిశ్రమలైతే పవర్‌ హాలిడే కారణంగా మూతపడేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.