ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:38

ప్రతి ఎకరాకు సాగునీరిస్తాం

ప్రతి ఎకరాకు సాగునీరిస్తాం

  • దేవాదుల పనులు వేగవంతం చేయాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి హన్మకొండలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఆరు జిల్లాల కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వీలైనంత త్వరగా సాగునీటిని అందించేలా పనులు జరుగాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు పనులకు నిధుల కొరతలేదని, భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఫీడర్‌ చానల్‌ పనులను చేపట్టి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. దేవాదుల మూడో దశలో చేపట్టే పనుల్లో ముఖ్యమైన టన్నెల్‌, సర్జ్‌పూల్‌, మోటర్ల బిగింపు పనులను వచ్చే ఏడాది జూన్‌ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష అనంతరం దేవాదుల పరిధిలోని జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లు (నష్కల్‌) రిజర్వాయర్‌ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు.